అందరూ భయపడిందే జరిగింది. ఉక్రెయిన్, రష్యా వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశం పై మిలటరీ ఆపరేషన్ ను తాజాగా ప్రకటించింది రష్యా దేశం. ప్రపంచ దేశాలు వద్దని కోరుతున్నా పుతిన్ పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపారు. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఆయన ఈ ప్రకటన చేశారు. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది.
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా దేశ ప్రకటనతో.. ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి. మరోవైపు రష్యాను ఉద్దేశించి నిన్న రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్వేగభరితమైన విన్నపం చేశారు. యూరప్ లో పెద్ద యుద్ధానికి తెరతీయవద్దని రష్యాను కోరారు. ఉక్రెయిన్ లో రష్యా జాతి ప్రజలు కూడా ఉన్నారని చెప్పారు.
ఇక పుతిన్ ఆదేశాలతో ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా బలగాలు చొచ్చుకుపోయాయి. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపులా రష్యన్ బలగాలు మోహరించాయి. దాదాపు 1.50 లక్షల రష్యన్ సైనికులు యుద్ధరంగంలో ఉన్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభమైన వెంటనే… ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమయింది. పరిస్థితిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానిపై చర్చలు జరుపుతోంది.