డాక్టర్ డూ లిటిల్ బతికున్న ప్రతీ జంతువుతో మాట్లాడగలడు. అడవి జంతువులను కూడా తన మాటల్తో కట్టి పడేయగలడు. అయితే, ఇది నిజ జీవితంలో సాధ్య పడుతుందా అంటే కాదని చెప్పొచ్చు.
‘డాక్టర్ డూ లిటిల్’ గురించి చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు. హాలీవుడ్‌లో చాలా పాపులర్ అయిన ఓ సినిమా హీరో క్యారెక్టర్ ఇది. ‘డాక్టర్ డూ లిటిల్’ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఇంగ్లీష్‌లో చాలా సినిమాలు వచ్చాయి. 2020లో కూడా రాబర్ట్ డౌనీ జూనియర్ హీరోగా ఓ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. జంతు వైద్యుడైన హీరో ప్రాణమున్న జంతువులతో మాట్లాడగలడు. వాటి మనసులోని భావాలను అర్థం చేసుకోగలడు. ఇదంతా సినిమాకు సంబంధించిన విషయం. ఇది నిజ జీవితంలో సాధ్యం కాదు. కానీ, ఓ మహిళ ఓ అడుగు ముందుకు వేసి తాను బతికున్న జంతువులతోనే కాదు.. చనిపోయిన జంతువులతో కూడా కమ్యూనికేట్ అవ్వగలనని అంటోంది. ఇంతకీ ఆ సంగతేంటంటే..
అమెరికాకు చెందిన డానియెల్లే మాకినన్ కొన్నేళ్ల క్రితం మార్కెటింగ్ జాబ్ చేసేది. ఆ సమయంలో ఓ సారి ఆమె పెంపుడు కుక్కకు అనారోగ్యం వచ్చింది. దాని సమస్య ఏంటో ఆమె తెలుసుకోలేకపోయింది. తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. అయితే, ఈ నేపథ్యంలోనే ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. జంతువులతో కమ్యూనికేట్ అయ్యే కోర్స్ నేర్చుకోవాలని అనుకుంది. ఇందుకోసం మార్కెటింగ్ జాబ్‌ను వదిలేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అనిమల్ కమ్యూనికేటర్‌గా మారిపోయింది. ఈ విషయంపై డానియెల్లే మాకినన్ మాట్లాడుతూ.. ‘‘ జాబ్‌ను వదిలేయమని జంతువులే నాతో చెప్పాయి. అప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత నేను జాబ్ మానేశాను. అనిమల్ కమ్యూనికేటర్‌లాగా మారిపోయాను.
మా జంతువులతో కమ్యూనికేట్ అవ్వండి అంటూ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మనుషుల్లానే జంతువులు కూడా మాట్లాడతాయి. నేను నా కుక్కతో కూడా కమ్యూనికేట్ కాగలను. జంతువులు అందరినీ ప్రేమిస్తాయి. కుక్కలు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాయి. జంతువులు యజమానుల ఎమోషన్స్‌తో కలిసిపోతూ ఉంటాయి. నేను చనిపోయిన జంతువులతో కూడా మాట్లాడగలను. కొత్త జంతువులను తెచ్చుకుని పెంచుకోవటం వాటికి ఇష్టమేనా అని అడగగలను’’ అని అంటోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.