Rat: దేశంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీలలో ఎలుకలు శవాలను పీక్కుత్తిన్నాయన్న వార్తలు చదివే ఉంటారు. శవాలనే కాకుండా బ్రతికున్న పేషంట్లను కూడా కొరుక్కుతిన్న ఘటనలు చాలానే జరిగాయి. ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరిస్థితి. ఇళ్లలో ఎన్ని ఎలుకలు ఉన్నా అవి మనుషుల మీద దాడి చేయవు. అలా చేయటానికి భయపడతాయి కూడా. ఎందుకంటే మనుషులు కదిలే స్థితిలో ఉంటారు కాబట్టి. అలాకాకుండా, అవి మీదకు ఎక్కినపుడు కానీ, దాడి చేస్తున్నపుడు కానీ, మనుషులు కదలకుండా ఉంటే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. కొరుక్కుత్తింటాయి. తాజాగా, ఇంగ్లాండ్‌లో ఇలాంటి ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధిరాలి ముఖంపై ఎలుక దాడి చేసి కొరికి తింది.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్, బింగ్‌హామ్‌కు చెందిన డియానా కిర్క్ అనే 76 ఏళ్ల వృద్ధురాలు బ్రేయిన్ డ్యామేజ్ కారణంగా కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైంది. 85 ఏళ్ల భర్త జాన్ కిర్క్‌తో కలిసి రింగ్‌వుడ్ రోడ్‌లోని ఇంట్లో ఉంటోంది. ఆమెను భర్తతో పాటు మరికొంతమంది సంరక్షకులు చూసుకుంటున్నారు. ఆ సంరక్షకులు పగటి పూట ఇంటికి వచ్చి రాత్రిళ్లు అక్కడినుంచి వెళ్లిపోతారు. రోజూలాగే ఆ రోజు కూడా వాళ్లు వెళ్లిపోయారు. రాత్రి వేళ డియానా కింద ఉన్న తన గదిలో పడుకోగా.. భర్త పై అప్‌స్టేర్స్‌లోని గదిలో పడుకున్నాడు. దాదాపు 1 గంట సమయంలో ఓ ఎలుక అతడి కాళ్ల దగ్గర తచ్చాడటం గమనించాడు. దాన్ని పట్టించుకోకుండా పడుకుండిపోయాడు.
ఉదయం యథావిథిగా 6 గంటలకు ముందే నిద్రలేచి భార్య గదిలోకి వెళ్లాడు. అక్కడ భార్య ముఖం నుంచి తీవ్రంగా రక్తం కారుతుండటం చూసి షాక్ తిన్నాడు. దగ్గరకి వెళ్లి చూడగా.. ముఖంపై చిన్న చిన్న గుంతలు కనిపించాయి. అవి ఎలుక కొరికిన గాట్లుగా గుర్తించాడు. వెంటనే ఇంటికి దగ్గరలోని ఓ యువతిని సహాయానికి పిలిచాడు. వాళ్లు ఆమెను క్వీన్స్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఎలుక డియానా ముఖం ఎముకల వరకు లోతుగా కొరికి పడేసినట్లు డాక్టర్లు చెప్పారు. వైద్యం చేసి ఆమెను ఇంటికి పంపించేశారు. జాన్ మరుసటి రోజు ఎలుకల బోనుపెట్టి ఆ ఎలుకను పట్టుకున్నాడు. పెల్లెట్ తుపాకితో దాన్ని కాల్చి చంపాడు. అది తనపై కూడా చాలా సార్లు దాడి చేయటానికి ప్రయత్నించిందని చెప్పాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Groom: వరుడు కావాలంటూ రోడ్డుకెక్కిన యువతి