మనిషి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. పట్టుదలకు అదృష్టం తోడైతే వ్యక్తి ఎదుగుదల ఎంతగా ఉంటుందో చెప్పడానికి రంజిత్ సింగ్ జీవితం ఉదాహరణగా నిలుస్తుంది. చదువు మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన రంజిత్ సింగ్ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో పాపులర్ యూట్యూబర్‌గా పేరు సంపాదించాడు. రాజస్థాన్‌కు చెందిన రంజిత్ సింగ్ పేదరికం కారణంగా పెద్దగా చదువుకోలేక 16 ఏళ్ల వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారాడు. జైపూర్‌లో ఆటో డ్రైవర్లు విదేశీ భాషలు నేర్చుకొని, సందర్శకులకు గైడ్‌గానూ వ్యవహరిస్తుంటారు. రంజిత్ పట్టుదలతో ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నేర్చుకున్నాడు. ఆటో డ్రైవింగ్‌తోపాటు సొంతంగా టూరిస్ట్ బిజినెస్ ప్రారంభించాడు.
రంజిత్ మాట తీరు, మర్యాద చూసి విదేశీయులు అతడి వద్దకు వెళ్లేవారు. దీంతో అతడి బిజినెస్ మూడు పువ్వులు – ఆరు కాయలుగా సాగింది. రంజిత్ పట్టుదల టూరిస్ట్ బిజినెస్‌ను ప్రారంభించేలా చేస్తే, అతడి ప్రేమ మరో దేశంలో స్థిరపడేలా చేసింది. రంజిత్ టూరిస్ట్‌గా ఉన్న సమయంలో ఫ్రాన్స్ నుంచి ఓ యువతి రంజిత్‌తో ప్రేమలో పడింది. తిరిగి ఫ్రాన్స్ వెళ్లాక కూడా వారి ప్రేమ కొనసాగింది. వారి ప్రేమ బంధం మరింత బలపడటంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్రాన్స్‌కు వెళ్లిన రంజిత్‌కు అక్కడ ఆహారం రుచించలేదు.
అక్కడి ఆహారపు అలవాట్లు నచ్చకపోవడంతో సొంతంగా వండుకోవడం మొదలుపెట్టాడు. వంటచేస్తున్న వీడియోలను సరదాగా యూట్యూబ్‌లో పెట్టేవాడు. కొన్నాళ్లకు స్విట్జర్లాండ్‌లోని జెనివాలో స్థిరపడ్డాడు. అక్కడ కూడా రంజిత్ వంటలు చేస్తూ నేర్పిస్తూ చేసిన వీడియోలు మంచి వ్యూస్ సంపాదించడంతో అతడి వ్లాగ్ పాపులర్ అయింది. త్వరలో అక్కడ ఓ భారతీయ రెస్టారంట్ కూడా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.