మద్యం తాగి కారు నడిపితే టెర్రరిస్టుతో సమానం అని మన పోలీసు పెద్దలు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అవును మద్యం తాగి కారు నడిపితే క్షమించరాని నేరం. మరి, కారు మద్యం తాగి పరుగులు పెడితే? అవునండి మీరు విన్నది నిజమే. ఆ మాట ఎవరో చెప్తే మేమూ నమ్మేవాళ్లం కాదులెండి. చెప్పింది స్వయానా ఒక యువరాజు. ఆయన కారు ప్యూర్ ఇంగ్లిష్ వైట్ వైన్‌తో పరుగులు పెడుతుందని వెల్లడించాడు. బ్రిటన్ యవరాజు ప్రిన్స్ ఛార్లెస్(72) చేసిన ప్రకటన ఇది. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ‘ఆస్టన్ మార్టిన్’ కారును వైన్‌తోనే పరుగులు పెట్టిస్తున్నారంట.
వాతావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాల ఉత్పత్తిని తగ్గించే క్రమంలో ప్రపంచ దేశాలు పెట్రోలు, డీజిల్ కార్లకు బదులుగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యువరాజు మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు దాదాపు 51 సంవత్సరాల క్రితం బహుమతిగా అందిన ఆస్టన్ మార్టిన్ కారంటే ఎంతో ఇష్టం. ఆ కారునే ఇప్పుడు ఇంజినీర్లు ఎంతో కష్టపడి వైన్‌తో నడిచేలా రెస్టోరేషన్ చేశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో మిగిలిఉన్న ఇంగ్లిష్ వైట్ వైన్‌తోనే ఈ కారును నడిపిస్తున్నారంట. అంతేకాదండి.. ఛీజ్ తయారు చేసే క్రమంలో మిగిలిపోయే పాలతోనూ ఈ ఆస్టన్ మార్టిన్ నడుస్తుందంట.
పర్యావరణ పరిరక్షణ కోసం 1970 నుంచి ప్రిన్స్ ఛార్లెస్ కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన ప్యాలెస్‌ను వేడి చేసేందుకు విద్యుత్ హీటర్లు కాకుండా.. బయో ఎనర్జీ బాయిలర్స్‌ను ఉపయోగిస్తారట. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ఈ కోరిక. తన ఇంజినీర్స్‌ను పిలిచి ఇంధనంతో నడిచే కారు కాకుండా కొత్తగా ప్రయత్నించండని కోరారంటి. చాలా కష్టపడి ఆ ఇంజినీర్లు సృష్టించిందే ఈ వైన్, ఛీజ్‌తో నడితే కారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు తమవంతుగా కృషి చేయాలని ప్రిన్స్ పిలుపునిచ్చారు. ఈ నెల 31న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ‘భూగోళాన్ని పరిరక్షించేందుకు దేశాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని’ ప్రిన్స్ ఛార్లెస్ పిలుపునిచ్చారు. వైన్‌తో నడితే కారుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.