మనిషి చేసిన మంచి, చెడు పనుల మీద మరణం తర్వాతి జీవనం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మంచి చేసిన వాళ్లు స్వర్గానికి, చెడు చేసిన వాళ్లు నరకానికి వెళతారని అంటూ ఉంటారు. అయితే, మరణం తర్వాత ఏమవుతుంది? అసలు స్వర్గం నరకం ఉన్నాయా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. దేవుడ్ని నమ్మేవాళ్లు ఉన్నాయని, నమ్మని వాళ్లు లేవని వాదించుకుంటూ ఉంటారు. కొంత మంది తాము చనిపోయి మళ్లీ బతికామని, నరకాన్ని చూశామని చెప్పుకోవటం కూడా జరిగింది. తాజాగా, అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన గెరాల్డ్ జాన్సన్ అనే ఓ వ్యక్తి తాను చనిపోయి నరకానికి పోయి వచ్చానని అంటున్నాడు.
అతడు తన నియర్ డెత్ అనుభవాల గురించి చెబుతున్న చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ 2016లో నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు నా ఆత్మ నా శరీరాన్ని విడిచి బయటకు వచ్చింది. నేను పైకి వెళుతున్నానని నాకు అర్థం అయింది. ఎందుకంటే.. నేను నా జీవితంలో చాలా మంచి పనులు చేశాను. చాలా మందికి సహాయం చేశాను. నేను చాలా దైవ నిర్ణయాలు తీసుకున్నాను. అయితే, దానికి వ్యతిరేకంగా కిందకు వెళ్లటం మొదలైంది. నేను భూమి మధ్య భాగంలోకి వెళ్లాను. అక్కడే నరకం ఉంది.
నేను అక్కడ చూసినవన్నీ చాలా అద్బుతంగా ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడిన ప్రతీసారి భావోద్వేగానికి గురవుతున్నాను. అక్కడ మనిషి నాలుగు కాళ్లపై నడుస్తున్నాడు. కొంతమందిని తలనుంచి కాలి బొటన వేలు వరకు కాలుస్తున్నారు. ఈ భూమ్మీద నరకాన్ని స్పూర్తిగా తీసుకుని చాలా పాటల లిరిక్స్ రాశారు. అక్కడ కొన్ని రిహానా పాటలు కూడా విన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, నరకానికి వెళ్లి వచ్చానని అంటున్న గెరాల్డ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.