ముక్కు మీద ఉన్న మొటిమలను గిల్లటం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే, మన ముఖంపై లేచే అన్ని గుల్లలు మొటిమలు కాకపోవచ్చు. అవి ఒక్కోసారి ప్రాణాంతకమైన క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు.
సాధారణంగా అందరికీ ముఖం మీద మొటిమలు లేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమందికి ముక్కుపై మొటిమలు ఎక్కువగా లేస్తూ ఉంటాయి. సరైన శుభ్రత పాటిస్తే.. వాటంతట అవే పోతాయి. కానీ, కొంతమంది వాటిని పదేపదే ముడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది వాటిని గిల్లుతూ ఉంటారు. అయితే, కొన్ని సార్లు మన ముఖంపై వచ్చేవి మొటిమలు కాకపోవచ్చు. ప్రాణాలు తీసే క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ జీవితమే ఉదాహరణ. మొటిమ అనుకున్నది ప్రమాదకరమైన క్యాన్సర్ గడ్డగా మారింది.
ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులు అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌లోని ఓరెవాకు చెందిన 52 ఏళ్ల మిచెల్లే డేవిస్ 2022 ఏప్రిల్ నెలలో ముక్కుపై ఓ మొటిమ లేచింది. ఎర్ర రంగులో ఉన్న అది దానంతట అదే పోతుంది అని ఆమె భావించింది. పెద్దగా.. చూడ్డానికి అసహ్యంగా ఉన్న అది నెలలు గడుస్తున్నా పోలేదు. దీంతో ఆమె 2023 జనవరి నెలలో దాన్ని చేత్తో అదిమింది. అయితే, అందులోంచి ఎలాంటి చీము రాలేదు. కానీ, ఏక ధాటిగా రక్తం వస్తూ ఉంది. ఎంతకీ రక్తం కారటం ఆగలేదు. ఈ నేపథ్యంలో డేవిస్ దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లింది. ఆ మొటిమను పరిశీలించిన డాక్టర్లకు అనుమానం వచ్చింది.
వెంటనే క్యాన్సర్లను గుర్తించే పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అది స్కిన్ క్యాన్సర్ గడ్డ అని తేలింది. అది స్కిన్ క్యాన్సర్ గడ్డ అని తేలగానే డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఏప్రిల్ 2023న ఆమె ముక్కు మీద ఉన్న కొంత భాగాన్ని కత్తిరించి కుట్లు వేశారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో ఆమె జీవితం తల కిందులు అయింది. క్యాన్సర్ చేసిన గాయాలతో డెవిస్ కాలం వెల్లదీస్తోంది. మరి, ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.