కరోనా ఈ మూడు అక్షరాలు మానవాళిని వణికిస్తున్నాయి. ప్రపంచ దేశాలకి నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ని మాత్రమే సంజీవనిగా భావిస్తున్నాయి. నిజానికి మొదట చాలా దేశాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. కానీ..,ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కావాల్సిన వారికి వ్యాక్సిన్స్ దొరుకుతున్నాయి. కానీ.., ఇలాంటి సమయంలో కూడా కొంత మంది అపోహల కారణంగా వ్యాక్సినేషన్ కి ముందుకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దారుణంగా నష్టపోయిన దేశాల్లో ఫిలిప్పీన్స్ ముందు వరుసలో ఉంది. ఫిలిప్పీన్స్ లో ఇప్పటివరకు 13 లక్షల పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 వేల మందికి పైగా మరణించారు. ఒకవైపు ఆ దేశ వైద్య రంగం అన్నీ విధాలా కష్టపడుతున్నా.., అక్కడ మరణాల రేటు అధికంగా ఉంది. ఇక ఈ వైరస్ కారణంగా ఆర్ధికంగా కూడా ఫిలిప్పీన్స్ చాలా నష్టపోయింది. ఇందుకే ఫిలిప్పీన్స్ లో ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియని యుద్ధ ప్రతిపాదికన చేస్తున్నారు. కానీ.., ఇలాంటి సమయంలో కూడా కొంతమంది వ్యాక్సిన్ పట్ల విముఖత చూపించడం ఆ దేశ అధ్యక్షుడి ఆగ్రహానికి కారణం అయ్యింది. దాంతో టీకా వేసుకోవడానికి నిరాకరించిన ప్రజలపై రోడ్రిగో డ్యూటెర్టే విరుచుకుపడ్డారు.
టీకా వద్దంటే ఖబర్దార్.. జైలులో ఊచలు లెక్కించాల్సిందే అని హెచ్చరికలు జారీ చేశాడు. అక్కడితోనే ఆయన వ్యాఖ్యలు ఆగలేదు. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేదనుకునే వాళ్లు.. భారత్, అమెరికా లాంటి దేశాలకి వెళ్లండంటూ నోరు జారారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. అన్నీ విపుల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నా మాటలను తప్పుగా భావించవద్దు. దేశంలో కరోనా సంక్షోభం ఉంది కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అని డ్యూటెర్టే వివరణ ఇచ్చుకున్నారు.