పోలీస్ స్టేషన్‌లో రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది అధికారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మరి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..
ఓ ఆయుధ డిపోలో సోమవారం రాత్రి రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఉగ్రవాద నిరోధక మందుగుండు సామాగ్రి డిపోలో పేలుళ్లు చోటుచేసుకోగా.. ఈ ఘటనలో కనీసం 13 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణం పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. వాయవ్య పాక్‌లోని ఉగ్రవాద డిపోలో ఈ ప్రమాదం చోటు చేసకుంది. ఈ సందర్భంగా ప్రావిన్షియల్ పోలీసు చీఫ్ అక్తర్ హయత్ మాట్లాడుతూ.. వాయువ్య స్వాత్ లోయలోని ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశం 2009లో సైనిక ఆపరేషన్‌కు ముందు వరకు కూడా ఇస్లామిక్ ఉగ్రవాదులు నియంత్రణలో చాలాకాలం ఉందని వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. ‘విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చు. బయటి నుంచి ఈ దాడి జరిగింది అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని పోలీస్ అధికార ప్రతినిది ఓ ప్రకటన విడుదల చేశారు. వేర్పాటువాదం బలంగా ఉన్న స్వాత్ లోయలో పోలీసులు, తీవ్రవాద వ్యతిరేక దళాల ఉనికి గణనీయంగా ఉంది. 2018లో అఫ్గన్ వైమానిక దాడిలో హతమైన పాకిస్తాన్ తాలిబన్ మాజీ చీఫ్ ముల్లా ఫజులుల్లా, ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌లు ఈ ప్రాంతానికి చెందినవారే.
కాగా, పేలుళ్లకు సంబంధించిన ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ పేలుళ్లలో మరణించిన వారిలో ఎక్కువ మంది ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందిన అధికారులేనని వెల్లడించారు. అంతేకాక ప్రమాదం జరిగిన సమయంలో.. భవనం పక్కనే వెళ్తున్న ఒక మహిళ, ఆమె బిడ్డ కూడా మరణించారని హయత్ తెలిపారు. ఈ పేలుళ్లు ఆత్మాహుతి దాడి, ఉగ్రవాద చర్యగా కనిపించడం లేదని ఉగ్రవాద నిరోధక విభాగం ప్రాంతీయ చీఫ్ సోహైల్ ఖలీద్ మీడియాతో తెలిపారు.
‘‘మా వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు ఉన్న దుకాణం ఉంది.. కొంత అజాగ్రత్త కారణంగా దానిలో పేలుడు సంభవించి ఉండవచ్చని మేము ఇప్పటివరకు నమ్ముతున్నాం. ఈ ప్రమాదానికి సంబంధించి అన్ని యాంగిల్స్‌లో పరిశోధన చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. కాగా, గాయాలతో చాలా మంది చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.