పాకిస్థాన్ తన పిచ్చి నిర్ణయాలతో తరచూ ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అనేక తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటుంది. అలా వివాదస్పద నిర్ణయాలు తీసుకోవడం.. వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పడం పాక్ కి అలవాటు. కేవలం పాక్ ప్రభుత్వమే కాదు.. అక్కడ ఉండే సంస్థలు సైతం ఇలాంటి పనులే చేస్తుంటాయి. తాజాగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తన సిబ్బందికి క్షమాపణ చెప్పింది. తన సిబ్బంది వేసుకునే ‘లో దుస్తులు’ కూడా ఏక రూపంగా ఉండాలంటూ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల అంశంలో వెనక్కి తగ్గింది. వివరాల్లోకి వెళ్తే…
పాకిస్థాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న “పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్(PIA)”.. తన సిబ్బంది.. ‘లో దుస్తులు’ కూడా తప్పనిసరిగా ఏకరూపంగా ఉండాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందికి సరైన వస్త్రాధారణ లేకపోతే.. వ్యక్తిగతంగానే కాకుండా ఎయిర్ లైన్స్ పై కూడా వ్యతిరేక ప్రభావం పడుతోందని చెప్పుకొచ్చింది. పీఐఏ తీసుకున్న ఈ నిర్ణయ తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. చాలా మంది సిబ్బంది నిరసన తెలుపుతూ రోడ్లపైకి వచ్చారు. ఈ ఉత్తర్వులు ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాల్లో పోస్టులు కూడా ప్రత్యక్షమయ్యాయి. పౌరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఇచ్చిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంది. విమాన సిబ్బంది మంచి వస్త్రధారణతో విధులకు హాజరుకావాలని తెలియజేయడమే తమ ఉద్దేశమని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఒకరు తెలిపారు.
అయితే తమ భావాన్ని వ్యక్తపరచడంలో ఎయిర్ లైన్స్ అధికారులు విఫలమయ్యారని ఆయన తెలిపారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది మనస్సులను బాధ పెట్టినందుకు క్షమించాలని కోరారు. “ఈ ఉత్తర్వులో వాడిన పదాలు సరిగ్గా లేవు. సంస్థ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా కొందరు ఈ అంశాన్ని ట్రోలో చేయడం బాధాకరం. నేను వ్యక్తిగతం చాలా చింతిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఇలా అనాలోచిత నిర్ణయంతో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్తూ.. వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.