డబ్బున్నోడి దగ్గర లాగేయ్, పేదోడికి పంచేయ్ అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ధనవంతుల దగ్గర డబ్బులు కొట్టేసి పేదోళ్ళకి పంచిపెట్టే హీరోలని చూసి చప్పట్లు కొడతారు. అయితే సినిమాల్లో హీరోయిజం చూపించినట్టే నిజ జీవితంలో కూడా హీరోయిజం చూపిస్తారా అంటే అవుననే చెప్పాలి. ధనవంతుల నుంచి అదనంగా డబ్బులు లాగుతూ ఆ డబ్బులను పేదల కోసం వినియోగిస్తున్నారు. ఎక్కడంటే?
ధనవంతుల దగ్గర పైసలు లాగి.. ఆ డబ్బును పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు కొనలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం.. వారి కోసం సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సబ్సిడీ డబ్బును కవర్ చేసేందుకు ధనవంతుల దగ్గర ఆ డబ్బులు వసూలు చేస్తుంది. ఆ ప్రభుత్వం ఇక్కడిది కాదు, పాకిస్తాన్ దేశ ప్రభుత్వం. అవును పాకిస్తాన్ ప్రభుత్వమే తమ ప్రజల అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరడంతో అక్కడ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ సరుకులూ కొనే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. దీంతో డబ్బు లేనోళ్ళు వాహనాలను బయటకు తీసే పరిస్థితి లేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న పాక్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు, పేదల కోసం పెట్రోలియం రిలీఫ్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ కింద పెట్రోలియం ఉత్పత్తులపై లీటర్ పై రూ. 100 సబ్సిడీ అందించనుంది. అయితే సబ్సిడీ ఇవ్వాలంటే డబ్బు కావాలిగా. ఆ డబ్బును ధనవంతుల నుంచి వసూలు చేయనున్నట్లు పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ వెల్లడించారు. ధనవంతుల నుంచి ఒక్కొక్కరి దగ్గర లీటర్ పెట్రోల్ ఉత్పత్తులపై రూ. 100 అదనంగా వసూలు చేస్తామని.. ఆ డబ్బుతో పేదలకు సబ్సిడీలో పెట్రోల్, డీజిల్ అందజేస్తామని అన్నారు. పేదవారికి తక్కువ ధరకు అందించడం కోసం ధనవంతులకు పెట్రోల్ ఉత్పత్తులను ప్రియంగా మార్చామని అన్నారు.
ధనవంతుల వద్ద మూలుగుతున్న డబ్బులతో పేదల బతుకులను మునిగిపోకుండా కాపాడవచ్చునని అన్నారు. అయితే బడ్జెట్ మోటార్ సైకిళ్ళు, రిక్షాలు, 800 సిసి కార్లు, ఇతర చిన్న కార్లు వంటి వాహనాలను ఈ సబ్సిడీ జాబితాలో చేర్చారు. ఇక ఖరీదైన బైకులు, లగ్జరీ వాహనాలను ధనికుల జాబితాలో చేర్చారు. వీరి నుంచి లీటర్ పెట్రోల్, డీజిల్ దగ్గర రూ. 100 అదనంగా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని 6 వారాల పాటు పాక్ ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 272 ఉండగా.. డీజిల్ ధర రూ. 293 ఉంది. లీటర్ కిరోసిన్ రూ. 190.29 ఉంది. పేదవారు కొనుక్కోలేని పరిస్థితి నెలకొనడంతో ధనవంతుల వద్ద నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బును పేదల కోసం వినియోగించనుంది. మరి ధనవంతుల దగ్గర లాక్కుని.. పేదలకు పంచిపెడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
In Pakistan, fuel ₹100 costlier for rich to fund fuel for poor pic.twitter.com/mhdZjjGTDh
— PKMKB (@Vikasra16976757) March 21, 2023