పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయాన్ని ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ప్రారంభించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లా తేరి గ్రామంలో వందేళ్ల చరిత్ర కలిగిన హిందూ సన్యాసి శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ చారిత్రాత్మక సమాధి ఉంది. దీపావళి సందర్భంగా సోమవారం అక్కడ నిర్వహించిన వేడుకలకు జస్టిస్ అహ్మద్ హాజరయ్యారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పటికీ, డిసెంబర్ 2020లో స్థానికులు కొందరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని జస్టిస్ అహ్మద్ ఆదేశించారు.
పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు సోమవారం ఆలయానికి వచ్చి, పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా తన బాధ్యత అని అహ్మద్ అన్నారు. కాగా ఈ గుడి విధ్వంసం కేసులో దాని మరమ్మతులకయ్యే సుమారు 3.3 కోట్ల పాకిస్తానీ రూపాయలను చెల్లించాలంటూ 123 మంది నిందితులను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. విధించిన జరిమానాలో చాలా వరకూ సేకరించి, దేవాలయ పునురద్ధరణ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాల వారు మెచ్చుకుంటున్నారు. 2020 డిసెంబరులో కొంతమంది ఈ గుడిని చుట్టుముట్టి, ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. హిందువులు తమ పూజా స్థలాన్ని విస్తరించాలనుకోవడమే అందుకు కారణం.
ఈ ఘర్షణలో ఆలయం ధ్వంసం అయింది. దీంతో ఆలయ నిర్వాహకులు పాక్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిందితులకు జరిమానా విధించడమే కాకుండా హిందువులకు భూమి కూడా ఇవ్వాలని పాక్ చీఫ్ జస్టిస్ ఆదేశించారు. కావాలనుకుంటే తమ పూజా స్థలాన్ని హిందువులు విస్తరించుకోవచ్చని కూడా పేర్కొన్నారు. అందుకు అవసరమైన సాయం ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ ప్రభుత్వం నుంచి అందుతుందని తెలిపారు. ఈ కేసు విషయమై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. పాక్ కోర్టు తీర్పుపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి పాక్ చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పుపై, ఆలయాన్ని ప్రారంభించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.