ప్రపంచవ్యాప్తంగా దాదాపు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే ఒమిక్రాన్ నుంచి రక్షణ కలుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఈ కోత్త వేరియంట్ పై ఎంత ప్రభావం చూపుతాయన్నది సందేహాస్పదంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై రెండు డోసులతో లభించే రక్షణ పాక్షికమేనని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా తక్కువ ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.
తాజాగా బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఒమిక్రాన్ పై వ్యాక్సిన్ల సమర్థత అనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ కరోనా వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకున్నవారిపై పరిశోధన చేపట్టారు. ఇదివరకు ఇన్‌ఫెక్షన్ బారినపడి కోలుకున్న వారితోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్‌తో ముప్పు పొంచివుందని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఉత్పన్నమైన యాంటీబాడీలు డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని, ఒమిక్రాన్ పై మాత్రం స్వల్పంగానే పోరాడుతున్నాయని గుర్తించారు.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కోవాలంటే మూడో డోసు (బూస్టర్) అవసరం అని అర్థమవుతోందని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు వెల్లడించారు. మూడో డోసు తీసుకున్న వారిలో మాత్రం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని.. వీటి ఫలితాలు మరింత విశ్లేషించాల్సి ఉందని వెల్లడించారు. అయినప్పటికీ ఒమిక్రాన్ వల్ల ఇన్‌ఫెక్షన్ కేసులు అధికంగా ఉండనున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్ర వ్యాధి నుంచి ఏమేరకు రక్షణ కల్పిస్తాయనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్‌ల సామర్థ్యం విషయంలో మరికొన్ని వారాల్లోనే అర్థవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆస్ట్రాజెనెకా టీకా రూపకర్తల్లో ఒకరైన థెరిసా లాంబే స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ వల్ల తీవ్ర వ్యాధి, ఆస్పత్రుల్లో చేరికలు లేదా మరణం ముప్పు నుంచి మాత్రం ప్రస్తుత వ్యాక్సిన్‌లు రక్షణ కల్పిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొత్త రకాలకు మరో వ్యాక్సిన్ కావాల్సి వస్తే వాటిని వేగంగా రూపొందించేందుకు తమతో పాటు ఇతర వ్యాక్సిన్ తయారీ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా, బ్రిటన్ లో ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా పరిగణిస్తున్నారు. మూడు డోసులు తీసుకున్నవారినే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా పరిగణిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : అప్పుడు ప్రభాస్- ఇప్పుడు కింగ్.. అడవిని దత్తత తీసుకోనున్న నాగార్జున