వైరస్ ను పూర్తిగా అంతం చేశామనుకున్న చైనాలోనూ ఇప్పుడు కొత్త వేరియెంట్ పుట్టుకొచ్చింది.గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆ భయమే వెంటాడుతుంది. ఫస్ట్ వేవ్ అయిపోయాక దాని పని అయిపోయిందనుకుంటే మరో వేరియెంట్ రూపంలో సెకండ్ వేవ్ లో విరుచుకుపడింది. మళ్లీ థర్డ్ వేవ్ కూడా ఉంటుందంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. చైనా సరిహద్దు నగరం రూలీలో కరోనా విజృంభిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మహమ్మారిని నిలువరించేందుకు మొత్తం నగర జనాభాకి టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది. లక్షా 59వేల టీకా డోసులు నగరానికి చేరుకున్నట్లు చైనా మీడియా ‘సీసీటీవీ’ పేర్కొంది. మార్కెట్లు, శిశు సంక్షేమ కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రెస్టారెంట్లపై నిషేధం విధించింది. బహిరంగ కార్యక్రమాలను తక్కువ మందితో జరుపుకునేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. లాక్ డౌన్లు, మాస్కులు, భౌతికదూరాలు తాత్కాలికమే తప్ప, దీర్ఘకాలంలో పనిచేయవని వెల్లడైంది. చైనాలో కరోనా వ్యాప్తి తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కఠినమైన రీతిలో లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ సడలించగానే మళ్లీ కేసులు నమోదవుతున్నాయి.
గ్వాంగ్జౌ నగరంలో 20 కొత్త కేసులను గుర్తించారు. 20 పాజిటివ్ కేసులంటే పెద్ద విషయమేమీ కాకపోయినా, తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా సామాజిక వ్యాప్తిని పెద్దఎత్తున నియంత్రించిన చైనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్న నగరాల్లో పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇక తాజాగా మొదలైన కరోనా ఉద్ధృతిని నిలువరించేందుకు ఓ నగరం మొత్తం టీకా పంపిణీ చేపట్టడం ఇదే మొదటిసారి. ఇది కొత్త వేరియంట్ అని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. మునుపటి వేరియంట్లతో పోల్చితే దీని వల్ల అధిక ముప్పు ఉంటుందని చైనా అధికారులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.