అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని, కనికరిస్తుంది. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకేగినా బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్లినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏచిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం. ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మకు ఇప్పుడు బాధ్యతలు బాగా పెరిగాయి. ఆకాశంలో సగం అంటూ అన్నిటా అమ్మదే పైచెయిగా ఉంటోంది. ప్రతీ అమ్మకు నిజానికి ఆరోజు, ఈ రోజు అంటూ కాకుండా నిత్యమూ హ్యట్సాఫ్…
మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ ‘మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న అమ్మకు మదర్సే డే సందర్భంగా సర్వదా శతధా అభివాదాలు