పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. పెషావర్ నగరంలోని ఓ మసీదులో తీవ్ర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 28 మంది చనిపోగా, 150 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించినట్లుగా అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పేలుడు సంభవించిన చోట అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ప్రాంతాన్ని పాక్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీస్ లైన్స్ ఏరియాలో సమీపంలో జరిగిన ఈ ఘటనలో పేలుడు ధాటికి మసీదు ఒకవైపు కుప్పకూలిపోయింది. మసీదు లోపల ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లుగా పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మసీదులో బాంబు పేలుడు ఘటన గురించి పెషావర్ పోలీసు అధికారి సికిందర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఈ పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, ట్రీట్‌మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఈ మసీదుకు వచ్చారని.. వీరంతా ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిందని సికిందర్ ఖాన్ పేర్కొన్నారు. మసీదు బిల్డింగ్ లోని ఓ భాగం పూర్తిగా కుప్పకూలిందన్నారు. ఈ మసీదు అఫ్గానిస్థాన్ సమీపంలో ఉందని పోలీసు చీఫ్ మహ్మద్ ఇజాజ్ ఖాన్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం నమాజ్ సమయంలో పేలుడు సంభవించిందని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ ఇప్పటికే ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. గోధుమ పిండి కూడా దొరక్క దాయాది దేశ ప్రజలు సతమతమవుతున్నారు. కరెంటు కోతలు, మండిపోతున్న ఇంధన ధరలతో పాక్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో బాంబు పేలుడు లాంటి ఘటనలు అత్యంత బాధాకరమనే చెప్పాలి.