80, 90ల కాలంలో పెంకుటింట్లో ఉండే మధ్యతరగతి కుటుంబాల వారు.. వర్షం పడినప్పుడల్లా మంచాల మీద వర్షం నీరు పడకుండా వంట పాత్రలు పెట్టుకునేవారు. అలా బతికిన వాళ్లలో చాలా మంది ప్రతీ రోజూ మేడలను చూసి.. మనం కూడా ఏదో రోజు అలాంటి మేడలోకి వెళ్తాం అని లోపల మనసులో సవాలు చేసుకునే ఉంటారు. అలా కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని.. ఒక పూట తిని, ఒక పూట పస్తులుండి మొత్తానికి సొంతింటి కలను నిజం చేసుకున్న మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు ఎంతోమంది ఉండే ఉంటారు. అద్దింట్లో ఉంటూ ఫైనల్ గా ఒకరోజు సొంత ఇంటి కలని నెరవేర్చుకున్న పేదింటి వ్యక్తులు ఉండే ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే.. సొంతింటి కల అనేది కేవలం కల మాత్రమే కాదు, ఒక బరువైన ఎమోషన్.
పిల్లలు, పెద్దలతో సహా ప్రతీ ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల, బరువైన ఎమోషన్. తల్లిదండ్రులతో కలిసి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు దూరం నుంచి కనబడే పెద్ద పెద్ద బంగ్లాలు చూసి.. అలాంటి ఇంట్లోకి మనం ఎప్పుడు వెళ్తాం అమ్మ, నాన్న అంటూ అడుగుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు అనుభవించే చిన్న మానసిక వేదన, క్షోభ వర్ణించలేనిది. ఆ నెగిటివ్ సైన్ ని కూడా పట్టుదలతో పాజిటివ్ గా మార్చుకుని పిల్లల కలను నెరవేర్చే తల్లిదండ్రులు ఉంటారు. ఈ బతుకు, బతికేది పిల్లల కోసమే కదా అని ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు. తమ పిల్లల ముఖంలో సంతోషం చూడడం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. తాజాగా ఒక తల్లి తన పిల్లలకి సొంత ఇంటిని పరిచయం చేసింది.
తన పిల్లల్ని సర్ప్రైజ్ చేసేందుకు కొన్ని వారాల పాటు ఎదురుచూసిందట. ఇంటిని కొని, ఆ ఇంట్లో అడుగుపెట్టే రోజు వచ్చేవరకూ తన పిల్లలకి తెలియకుండా జాగ్రత్త పడిందట. వన్ ఫైన్ డే మొత్తానికి ఇల్లు రెడీ అయ్యాక పిల్లలకి పరిచయం చేసింది. ఒక తల్లి తన కొడుకుతో కలిసి కారులో వెళ్తోంది. కారులో వెళ్తుండగా ఆమె కొడుకు.. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద భవనాలను చూసి మురిసిపోతున్నాడు. ఇంతలో ఆమె తల్లి ఆ బాలుడ్ని పిలిచి.. ఒక భవనాన్ని చూపిస్తూ.. ‘ఆ ఇల్లు బాగుందా’ అని అడుగుతుంది. దానికి ఆ బాలుడు.. ‘ఆ చాలా బాగుంది’ అని అంటూ.. ‘ఆ ఇల్లు మనదైతే బాగుణ్ణు’ అన్న ఎక్స్ ప్రెషన్ పెడతాడు. అప్పుడు బాలుడి తల్లి.. ‘ఆ ఇల్లు మనదే’ అని చెబుతుంది. ఒక్కసారిగా బాలుడు ఆశ్చర్యానికి గురవుతాడు.
నిజంగా ఆ ఇల్లు మనదా? అని అమ్మని అడుగుతాడు. ఆ అమ్మ అవును మనదే అని చెబుతుంది. ఆ బాలుడు కన్నీళ్లు ఆపుకోలేకపోతాడు. బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటి ఇంట్లోకి వెళ్లాలని ఎప్పటి నుంచో బలమైన కోరిక నాటుకుపోతే తప్ప అంత ఎమోషనల్ అవ్వరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొడుక్కి సర్ప్రైజ్ ఇచ్చిన తల్లికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలానే సొంత ఇల్లు కొనుక్కున్నందుకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో మాత్రం ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. ప్రతీ పేద, మధ్యతరగతి వ్యక్తులూ ఈ ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నారు.