ప్రేమ.. రెండక్షరాల ఈ పదానికి ప్రపంచం దాసోహం అవుతుంది. మనిషిని తన ఇష్టం ఉన్నట్లు ఆడించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు ప్రేమ కోసమే జరిగాయి. దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, రోమియో-జులియెట్ వంటి అమర ప్రేమ కథలు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే రోజులు మారుతున్న కొద్ది.. ప్రేమ తన నిర్వచనాన్ని కోల్పోతుంది. తాత్కలిక కోరికలు తీర్చుకోవడానికి ప్రేమను ఆశ్రయిస్తున్న వారు నేటి సమాజంలో కోకొల్లలు. రాను రాను ప్రేమలో నిజాయితీ లోపిస్తుంది.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మెక్సికో సిటీలో చోటు చేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి తల్లికి కిడ్నీ పాడయి.. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. ప్రేయసి బాధ చూడలేని.. వ్యక్తి ఆమె కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఏకంగా తన కిడ్నీనే దానం చేశాడు. ఇంత చేస్తే చివరికి అతడికి దక్కింది బ్రేకప్. తల్లి కోలుకున్న నెల రోజుల తర్వాత సదరు యువతి మరో యువకుడిని వివాహం చేసుకుని.. తనను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని దారుణంగా మోసం చేసింది. ఆ వివరాలు..
బాజా కాలిఫోర్నియాకు చెందిన ఉజీల్ మార్టినేస్ అనే టీచర్ ఒక యువతిని ప్రేమించాడు. కొన్నేళ్ల పాటు వీరి ప్రేమ బాగానే సాగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఉజీల్ గర్ల్ ఫ్రెండ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని.. వెంటనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని సూచించారు. తల్లి అనారోగ్యం విషయం తెలిసి ఉజీల్ గర్ల్ ఫ్రెండ్ చాలా బాధపడింది. ప్రేయసి బాధ చూడలేని ఉజీల్ గొప్ప త్యాగానికి సిద్ధపడ్డాడు.
ఉజీల్ తన ప్రియురాలి తల్లికి కిడ్నీ దానం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కిడ్నీ మ్యాచ్ అవుతుందని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ చేసి.. విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. కోలుకున్న తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఉజీల్ గర్ల్ ఫ్రెండ్ ప్రవర్తనలో తేడా వచ్చింది. అతడిని దూరం పెట్టసాగింది. మాట్లాడటం తగ్గించింది. ఓ నెల రోజుల తర్వాత అతడికి భారీ షాక్ ఇచ్చింది. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.
తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి తెలియజేస్తూ.. ఉజీల్ టిక్ టాక్ లో ఓ వీడియోని షేర్ చేశాడు. ఇప్పటి వరకు దీన్ని 16 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. అంతేకాక ఆమెపై తనకు ఎలాంటి ద్వేషం కానీ, కోపం కానీ లేవని తెలిపాడు ఉజీల్. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘నీలాంటి గొప్ప వ్యక్తితో ఉండే అర్హత ఆ అమ్మాయికి లేదు..’, ‘ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు..’, ‘నువ్వు ఏం బాధపడకు’ అని కామెంట్స్ రూపంలో తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : తన యూజర్లకు 683 కోట్ల రూపాయలను చెల్లించనున్న టిక్ టాక్