Love Story: తరతరాలుగా, యుగయుగాలు ప్రేమ గుడ్డిది అన్న నానుడి స్థిరపడిపోయింది. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రేమ డబ్బు, గిబ్బు చూడదు.. పేద, ధనికం అనదు.. అందం, చందాలను పట్టించుకోదు. ఓ పెద్దింటి యువతి పేద యువకుడ్ని ప్రేమిస్తుంది.. ఓ అందమైన యువకుడు అందంగా లేని యువతిని ప్రేమిస్తాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఒకటే మెక్సికోకు చెందిన లుజ్ యెసెనియా, జువాన్ మెండోజాల జంట ప్రేమ కథ. ఈ ప్రేమ కథ చాలా వింతైనది. ఈ కథ 2009లో మొదలైంది. మెక్సికోలోని న్యూవో సాన్ జువాన్‌కు చెందిన లుజ్ యెసెనియా గెరోనిమో సెర్నా అనే మహిళ ఓ రోజు ఓ షాపునకు వెళ్లింది.
షాపు బయట ఉన్న బిచ్చగాడు జువాన్ మెండోజా అల్విజార్‌ను చూసింది. చూసి చూడంగానే నచ్చేశాడు. మొత్తం దుమ్ముకొట్టుకుపోయి మురికిగా ఉన్న అతడికి మేకోవర్ చేస్తానని అడిగింది. ఇందుకు అతడు ఒప్పుకున్నాడు. ఆమె అతడ్ని ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత జువాన్‌కు మేక్ ఓవర్ చేసి పూర్తిగా మార్చేసింది. జువాన్ తనను తాను అద్దంలో చూసుకుని మురిసిపోయాడు. లుజ్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. కొద్దిరోజుల్లోనే వీరిద్దరి మధ్యా స్నేహం మొదలైంది.
కొన్ని నెలల తర్వాత ఒకరినినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లయి ఇప్పటికి పదేళ్లు గడిచింది. ఈ నేపథ్యంలో లుజ్ తమ లవ్‌స్టోరీని టిక్‌టాక్‌లో షేర్ చేసింది. జువాన్ మేక్ ఓవర్‌కు ముందు, ఆ తర్వాత ఫొటోలను, ఇద్దరూ కలిసిన షాషను కూడా పోస్టు చేసింది. జువాన్‌ను తాను ఇష్టపడటానికి కారణం చెబుతూ..‘‘ జువాన్ ఇతరుల్ని చాలా చక్కగా ట్రీట్ చేస్తాడు. మొదటి చూపులోనే అతడి మీద నాకు ప్రేమ పుట్టింది. మొదటినుంచి మా ప్రేమ చాలా చక్కగా ఉండింది.
దాని గురించే నేను ఎదురుచూస్తూ ఉండేదాన్ని. అతడి కుటుంబం కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్లు నన్ను వాళ్ల కూతురులాగా ట్రీట్ చేస్తారు’’ అనిపేర్కొంది. జువాన్ ప్రస్తుతం ఓ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మిగిలిన సమయంలో మొబైల్ ఫోన్స్ రిపేర్ చేస్తుంటాడు. వీరికి ముగ్గురు పిల్లలు లారిస్సా, కింబెర్లీ, జాజిల్ ఉన్నారు. మరి, బిచ్చగాడిని మొదటి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న లుజ్ లవ్‌స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.