చైనా దేశంలోని వుహాన్ లో పుట్టుకు వచ్చిన మాయదారి మహమ్మారి కరోనా. రెండేళ్ల నుంచి కరోనా ధాటికి మనిషి ప్రాణాలే కాదు.. ఆర్థిక నష్టాలు కూడా ఎన్నో జరిగాయి. కేవలం కరోనా మాత్రమే కాదు.. వివిధ రకాల వైరస్ లు ఇప్పుడు మనిషికి పాటిల శాపాలుగా మారుతున్నాయి. తాజాగా అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి విజృంభిస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో ప్రజలు సాల్మొనెల్లోసిస్ బారినపడుతున్నారు. పొట్టలో నొప్పి, విరేచనాలు, జ్వరం, వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. రానున్న రోజుల్లో ఇది మహమ్మారిలా పరిణమించే అవకాశం ఉందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. ఈ వైరస్ భారిన పడ్డ వందలాది మంది జ్వరం బారినపడ్డారు. అయితే అనారోగ్యానికి కారణంగా భావిస్తున్న ఉల్లిగడ్డలను వాడరాదని, ఉంటే వాటిని పడేయాలని అమరికా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని మొత్తం 37 రాష్ట్రాల్లో ఈ ఫీవర్ రిపోర్ట్ అయింది. అయితే మెక్సికోలోని చిహువాహువా నుంచి దేశంలోకి దిగుమతి అయిన ఉల్లిగడ్డలకు ఈ వింత రోగానికి సంబందమున్నట్టు అనుమానిస్తున్నారు.
ఇళ్లలోనూ, రెస్టారెంట్లలోనూ ఆ ఉల్లిగడ్డలతో చేసిన వంటకాలు తిన్నవారే సాల్మొనెల్లా బారినపడుతున్నట్టు వెల్లడైంది. కాగా, మెక్సికో ఉల్లిగడ్డలు తిన్న 6 గంటల్లోనే ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలో దుష్ప్రభావాలు చూపుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆగస్టు 27వ చివరిసారిగా ఉల్లిపాయలను దిగుమతి చేశారు. ఆయా ఉల్లిపాయాలను ఇళ్లల్లో, రెస్టారెంట్లలో వినియోగించినట్టు తేలింది. అమెరికాలో ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలనే కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని సీడీసీ హెచ్చరించింది.