ఈ రోజుల్లో చాలా వస్తువులు ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి. కొన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ప్రజలు తమ ఉత్పత్తులను సైతం నేరుగా అమ్ముకొనేందుకు వీలుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఓ వ్యక్తి ఏకంగా బాంబునే అమ్మకానికి పెట్టాడు. అది సాదాసీదా బాంబు కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిన ‘లైవ్ బాంబు’. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ‘eBay’లో దీన్ని అమ్మకానికి పెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నాటి లైవ్ బాంబును ‘eBay’లో అమ్మకానికి పెట్టారని తెలియగానే మిలిటారియా కలెక్టర్ రాల్ఫ్ షెర్విన్‌కు ఈ విషయం తెలియగానే అప్రమత్తమయ్యారు. వెంటనే విలియమ్స్‌కు మెసేజ్ పెట్టారు. అమ్మకానికి పెట్టినది పేలిపోయిన బాంబు కాదు. అది ఇంకా పేలేందుకు సిద్ధంగానే ఉందని తెలిపారు. నాకు తెలియదు. పిల్లలు ఆడుకొనే గ్రౌండ్‌లో అది దొరికిందని విలియమ్స్ తెలిపాడు. అయితే, అది చాలా ప్రమాదకరమైన బాంబు అని షెర్విన్ చెప్పినా సరే విలియమ్స్ పట్టించుకోలేదు.
ఈ సందర్భంగా షెర్విన్ మాట్లాడుతూ ‘‘అది పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబ్ అని చెప్పగానే అతడు దాన్ని eBay నుంచి తొలగిస్తాడని భావించాను. కానీ, అతడు అస్సలు పట్టించుకోలేదు. దాన్ని అమ్మేందుకే మొగ్గు చూపాడు. దీంతో షెర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఆ బాంబును జనవాసాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నెట్లీలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు సమీపంలో ‘కంట్రోల్డ్ ఎక్స్‌ప్లోజన్’ చేశారు. అంటే.. ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా దాన్ని పేల్చివేశారు. పోలీసులు విలియమ్స్‌ను అరెస్టు చేసి మళ్లీ విడిచిపెట్టారు. ఈ ఘటనపై eBay అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ప్రమాదకర ఆయుధాలు, బాంబులను ఇ-బేలో విక్రయించడానికి అనుమతి లేదు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులకు అతడి చిరునామా అందించి సహకరించాం’’ అని తెలిపారు.