”నిద్ర సుఖమెరగదు.. ఆకలి రుచి ఎరగదు..” అన్నారు పెద్దలు. అందుకే కాబోలు నిద్ర వచ్చిందంటే చాలు కుర్చీలో ఉన్నామా? కింద ఉన్నామా? లేదా ఇక్కెక్కడైన ఉన్నామా అన్నది చూడకుండా నిద్ర పోతాం. అలాగే బాగా ఆకలి వేస్తే కూడా ఏం కూర, రుచిగా ఉందా.. లేదా అని కూడా చూడం వెంటనే తింటాం. అలాగే బాగా నిద్ర పోతే ఇంట్లో వారు ‘రేయ్ ఏంట్రా కుంభకర్ణుడిలా ఆ మెద్దు నిద్ర’ అంటూ తిడతారు. మరి అలా మెద్దు నిద్ర పోయేవారికి ఉద్యోగం ఇస్తాం రండి అంటూ ఆహ్వానిస్తోంది ఓ కంపెనీ. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఉద్యోగులు ఎవరైన ఆఫీస్ లో నిద్ర పోతే ఏం జరుగుతుంది. ఒకటి రెండు సార్లు బాస్ క్లాస్ పీకుతాడు. మారక పోతే మనల్ని ఉద్యోగంలోంచి పీకుతాడు అంతేగా. అయితే నిద్ర పోయే వారే తమకు కావాలని ఓ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. అవును వినడానికి కాస్తా విడ్డురంగా ఉన్నా ఇది నిజం. వారికి ఆకర్షనీయమైన జీతాన్ని కూడా ఇస్తాం అని ప్రకటించింది.
అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ‘క్యాస్పర్’ అనే పరుపుల కంపెనీ ఈ జాబ్ లను ఆఫర్ చేస్తోంది. నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ ఉన్న వారు తమకు కావాలిని ప్రకటన జారీ చేసింది. ఇంకా ఆ ప్రకటనలో.. ”వీలైనంత ఎక్కువ సేపు నిద్ర పోయేవారు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మెలకువ రాని సామర్ధ్యం ఉన్న వారి కోసం మేం ఎదురుచూస్తూన్నాం”. అని ఆ ప్రకటనలో తెలిపింది.
ఇంకా మా స్టోర్లతో పాటు ఊహించని ప్రాంతాల్లో నిద్ర పోండి. తర్వాత మీ అనుభవాన్ని మాకు సోషల్ మీడియా ద్వారా పంచుకోండి అని సూచించింది. అలాగే ఎంపికైన వారికి తగిన జీతంతో పాటు తమ కంపెనీ ఉత్పత్తులను ఫ్రీగా అందిస్తామని పేర్కొంది. నిద్రా+జీతం కావాలనుకునే వారు దరఖాస్తులు పంపండి మరి. ఈ గురువారమే చివరి రోజు అని కంపెనీ తెలిపింది. మరి ఇలాంటి కంపెనీలు, జాబ్ లు కూడా ఉంటాయా అని తెలిసిన వారు ముక్కున వేలు ఏసుకుంటున్నారు. మరి ఇలాంటి ఉద్యోగం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.