ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా తన ఆకారన్ని మార్చుకుందీ మాస్క్. బ్లాక్ ప్లేగ్ నుంచి వాయు కాలుష్యం, ట్రాఫిక్ కాలుష్యం చివరికి రసాయన గ్యాస్ దాడుల వరకూ చాలా దేశాల్లో మాస్క్‌లు వాడుతున్నారు. వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఆరో శతాబ్దం ముందు నుంచే మాస్క్‌లను ఉపయోగించేవారని చెబుతున్నారు. జనం తమ నోటిని గుడ్డతో కప్పుకున్నట్టు ఉన్న చిత్రాలు పర్షియన్ సమాధుల తలుపుల మీద కనిపించాయి. మార్కో పోలో వివరాల ప్రకారం 13వ శతాబ్దంలో చైనాలో నౌకర్లు, నేసిన వస్త్రంతో తమ ముఖం కప్పుకోవాల్సి వచ్చేది. చక్రవర్తి తింటున్నప్పుడు ఆ ఆహార పదార్థాల సువాసన, నౌకర్లు వదిలే శ్వాసతో పాడవకూడదనే అలా చేసేవారని చెబుతారు. 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ ప్లేగ్ మొట్టమొదట యూరప్‌లో వ్యాపించింది. 1347 నుంచి 1351 మధ్య ఆ వ్యాధి అక్కడ రెండున్నర కోట్ల మందిని బలి తీసుకుంది. తర్వాత నుంచి అక్కడి డాక్టర్లు స్పెషల్ మెడికల్ మాస్కులు ఉపయోగించడం మొదలుపెట్టారు. 17వ శతాబ్దం మధ్యలో ప్లేగ్ వ్యాపించినప్పుడు, కాకి ఆకారంలో ఉన్న మాస్కు ధరించిన ఒక వ్యక్తి చిత్రం కనిపించడం మొదలైంది. దానిని చాలా మంది మృత్యువు నీడగా పిలిచేవారు.
ఆ మాస్క్ ముందు ముక్కులా ఉన్న చోట సువాసన వచ్చే మూలికలను నింపేవారు. ఆ తర్వాత సమయంలో కూడా ఇలాంటి మాస్కులు ఉపయోగించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో క్లోరిన్ గ్యాస్, మస్టర్డ్ గ్యాస్ లాంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడంతో, భయపడిన ప్రభుత్వాలు తమ ప్రజలకు, సైనికులకు విష వాయువుల నుంచి రక్షించుకోడానికి గ్యాస్ మాస్కులు పంపిణీ చేశాయి. సైకిళ్లపై గస్తీ కాసే పోలీసులు కూడా వాటిని తమ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌లా ధరించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక కొన్ని దేశాల ముందు మరో భయంకరమైన సవాలు నిలిచింది. స్పెయిన్‌లో మొదట ఒక ఫ్లూ వ్యాపించడం మొదలైంది. అది తర్వాత మహమ్మారిగా మారింది. ఆ వ్యాధి స్పెయిన్‌లో ఐదు కోట్ల మంది ప్రాణాలు తీసింది. ఆ వ్యాధి స్పెయిన్ నుంచి వ్యాపించడంతో దానికి స్పానిష్ ఫ్లూ అనే పేరు పెట్టారు. 1918లో నర్సింగ్ టైమ్స్ పత్రికలో ఈ వ్యాధి నుంచి కాపాడుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రచురించారు. ఆ సమయంలో మీరు బతికి ఉండాలంటే, మాస్కులు ఉపయోగించాలని పౌరులకు కూడా సూచించారు. చాలా మంది స్వయంగా తమ మాస్కులను తయారు చేసుకున్నారు. తర్వాత మరో రకం మాస్క్ వాడకంలోకి వచ్చింది. ఇది ఒక రకంగా మొత్తం ముఖాన్ని కప్పుకునే ఒక పెద్ద వస్త్రంలా ఉండేది. చాలా మంది ప్రముఖులు తమ అభిమానులు, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి మాస్కులే ఉపయోగించేవారు. కరోనా ఎఫెక్ట్ తో అందరూ అన్నిరకాల మాస్కులూ వాడటం కామన్ అయిపోయింది. కాల మహిమ మాస్క్ లేకపోతే ఫైన్ కట్టే సమయం ఇది.