ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతుంది. ఒమిక్రాన్ సంక్రమణ దేశాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 63 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ వల్ల మరణాలు అయితే సంబవించలేదని అనుకున్నారు. తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం నమోదైంది. యూకేలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక ప్రకటన చేశారు.
కొత్త వేరియంట్ కారణంగా ఆసుపత్రిపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ స్పందిస్తూ, ఒమిక్రాన్ పాజిటివ్ గా వచ్చిన వారు 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు ప్రజలు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవడమొక్కటే అత్యుత్తమ మార్గం అని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. గత నెలలో గుర్తించిన కరోనా కొత్త ఒమిక్రాన్.. ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్ సహా అనేక దేశాలకు కొన్ని రోజుల వ్యవధిలోనే వ్యాపించిన ఈ కొత్త వేరియంట్.. ఆయా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లో ఇప్పటివరకు 38 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అధికారులు దృష్టి పెట్టారు.
ఇది చదవండి : కరోనా బారిన పడ్డ ప్రముఖ నటి