సాధారణంగా పిల్లల విషయంలో తండ్రి కంటే ఎక్కువగా తల్లిని పొగుడుతూ ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో తండ్రి.. తల్లికి ఏ మాత్రం తక్కువ కాదు. తమ బిడ్డల బాగుకోసం తమ ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుకాడరు. తాజాగా, ఓ తండ్రి తన బిడ్డలను తన దగ్గరకు తెచ్చుకోవాలన్న బలమైన నిశ్చయంతో ఏ తండ్రి చెయ్యని పనిని చేశాడు. ఏకంగా స్త్రీగా మారాడు. ఇంతకీ ఎవరా వ్కక్తి? ఎందుకు ఆ వ్యక్తి తన లింగాన్ని మార్చుకోవాల్సి వచ్చింది? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మిగిలిన స్టోరీ చదివేయండి.
ఈక్వెడార్‌కు చెందిన 47 ఏళ్ల రెనె సాలినాస్ రామోస్ అనే వ్యక్తి భార్యతో గొడవల కారణంగా విడిపోయి వేరుగా ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. అయితే, వారి కూతుర్ల కస్టడీ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతోంది. కోర్టులో ఈ మేరకు కేసు కూడా నడుస్తోంది. కొన్ని నెలల క్రితమే కోర్టు పిల్లల కస్టడీని తల్లికి అప్పగించింది. వారు తల్లితో పాటు ఉంటున్నారు. దీంతో రెనె పోరాటం మొదలుపెట్టాడు. కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు నడుస్తోంది. అయితే, తీర్పు తనకు ఫేవర్‌గా రావాలంటే లింగం మార్చుకుంటేనే అవుతుందని భావించాడు.
ఇందుకోసం తన దేశం ఇచ్చే ఐడెంటిటీ కార్డులో తనను తాను ఓ స్త్రీగా మార్చుకున్నాడు. అది కూడా అధికారికంగా. ఇప్పుడు అతడి ఐడెంటిటీ కార్డులో ఆడ అని ఉంటుంది. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ మహిళలకు ఎక్కువ హక్కు ఉందని న్యాయస్థానాలు చెబుతున్నాయి. అందుకే నేను స్త్రీగా మారాను. ఇప్పుడు నేను ఒక తల్లిని. నేను నా లింగం గురించి స్పష్టంగా ఉన్నా. నేను కేవలం ఓ తల్లిని కావాలని మాత్రమే ఆలోచించాను. నేను కూడా తల్లిలా ప్రేమ ఆప్యాయతలను చూపించగలను. ఓ తండ్రిగా ఉండటం ఈ దేశంలో ఓ నేరం. నా భార్య నా కూతుర్లని సరిగా చూసుకోవటం లేదు.
వారిని బాగా ఇబ్బంది పెడుతోంది. దాదాపు ఐదు నెలలుగా నేను నా కూతుర్లను చూడలేదు’’ అని అన్నాడు. కోర్టులో ఈ మేరకు వాదనలు కూడా చేశాడు. అయితే, కోర్టు అతడి వాదనలతో ఏకీభవించలేకపోయింది. విచారణ జరుగుతున్నంత కాలం అతడి కూతుర్లు తల్లి దగ్గరే ఉండాలని స్పష్టం చేసింది. అయితే, రెనె నిర్ణయంతో దేశంలోని ఎల్జీబీటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, కూతుర్ల కోసం తన జెండర్‌ను మార్చుకున్న ఈ తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.