మధ్య ఆఫ్రికాలోని అంగోలాలో ఈశాన్య ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. అందుకే ఆ ప్రాంతంలో వజ్రాల మైనింగ్ చేస్తుంటారు. మైనింగ్‌లో భాగంగా లూలో మైన్‌లో అరుదైన, స్వచ్ఛమైన పింక్ డైమండ్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది. 300 ఏళ్ళ తర్వాత దొరికిన వజ్రాల్లో ఇదే అతి పెద్ద వజ్రం అని చెబుతున్నారు. 170 క్యారెట్లు ఉన్న ఈ పింక్ డైమండ్‌ను లూలో రోజ్‌గా పిలుస్తున్నారు. అంగోలా, లెసోతోలో అతి విలువైన మైన్‌లున్న ‘లుకాపా డైమండ్’ కంపెనీ ఈ తవ్వకాలను చేపట్టింది. లూలో రోజ్ ఎంతో విలువైందని, ఇప్పటివరకూ గుర్తించిన వాటిలో ఇదే అతి పెద్ద డైమండ్ అని వెల్లడించింది. లూలో మైన్‌లో అక్కడి ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ అరుదైన డైమండ్ దొరకడంపై ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. ఇదొక చారిత్రాత్మక పరిణామమని వ్యాఖ్యానించింది. ఈ డైమండ్‌ను వెలికి తీయడం ద్వారా.. అంగోలా పేరు మరోసారి ప్రపంచమంతా మారుమోగిపోతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ డైమండ్ మార్కెట్‌లో అంగోలా కీలక పాత్ర పోషిస్తుందనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదని చెబుతోంది.
బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ వజ్రాన్ని అంతర్జాతీయంగా టెండర్ వేసి విక్రయిస్తారు. అంగోలాకు చెందిన ‘సోడియం’ అనే డైమండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ టెండర్ బాధ్యతలు తీసుకుంది. ఈ వజ్రాన్ని కట్ చేసి పాలిష్ చేసిన అనంతరం దాని విలువ ఎంత ఉంటుందనేది నిర్ధారిస్తారు. అయితే కట్ చేసి పాలిష్ చేయడం వల్ల దాదాపు 50 శాతం బరువు పోతుంది. అప్పుడు దీని అసలు విలువను నిర్ణయిస్తారు. గతంలో కూడా పింక్ డైమండ్స్‌ను విక్రయించారు. 2017లో 59.6 క్యారెట్ల పింక్ డైమండ్‌ను 71.2 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఇప్పటి వరకూ అమ్మిన డైమండ్స్‌తో పోలిస్తే ఇదే ఖరీదైంది. ఇప్పుడు దీని కంటే ఖరీదైన వజ్రం బయటపడింది. దీంతో అంగోలా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఆఫ్రికాలోనే కాదు, ఇంకా కొన్ని దేశాల్లో ఈ వజ్రాలు, వైడూర్యాల కోసం అన్వేషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఫిన్ ల్యాండ్‌లోని ఓ నిధి కోసం 35 ఏళ్ళుగా ‘ట్వల్వ్ టెంపుల్’ అనే టీమ్ ఈ నిధుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఫిన్ ల్యాండ్ రాజధాని హెల్సింకికి తూర్పున 20 మైళ్ల దూరంలో సిబ్సోస్‌బర్గ్ గుహలో ఆ నిధి ఉంది. దాదాపు లక్ష కోట్ల వరకూ నిధి ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటి వరకూ కనుగొన్న అత్యంత విలువైన నిధి ఇదే అని చెబుతున్నారు. గుహ లోపల ఉన్న భూగర్భ ఆలయంలో నిధి దాచి పెట్టారని.. ఈ ఆలయంలో వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, రత్నాలు, పురాతన కళాఖండాలు వంటివి ఉంటాయని పరిశోధకులు, చరిత్రకారులు చెబుతున్నారు. 35 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఎండనక, వాననక అన్వేషణలు జరుగుతున్నప్పటికీ నిధిని మాత్రం ఎవరూ కనుక్కోలేకపోయారు. చలికాలం వస్తే గుహలో నీరంతా గడ్డ కట్టుకుపోతుంది. నిధుల కోసం దశాబ్ధాలుగా ఇక్కడే క్యాంపు వేసుకుని ఉంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.