హిందూ ధర్మంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు వారిలో హనుమంతుడు చాలా ప్రత్యేకం. పురాణాల్లో చెప్పబడిన చిరంజీవుల్లో ఆయనొకరు! ఈ కారణంగానే ఇంకా భూమ్మీదే ఆంజనేయుడున్నాడని హిందువుల విశ్వాసం! రామాయణ కాలంలో జీవించిన హనుమంతుడు తరువాత ద్వాపరంలో భీముడ్ని పరీక్షిస్తాడు. తనకే చాలా బలముందని గర్విస్తున్న ఆయన్ని తోక ఎత్తమని అంటాడు. ఎత్తలేక చేతులెత్తేసిన భీముడికి జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక కలియుగంలో కూడా అంజనీ సుతుడ్ని దర్శించిన యోగులు, సాధకులు, పుణ్యాత్ములు ఎందరో! మధ్వాచార్యుల వారు హనుమని దర్శించారు. రాఘవేంద్ర స్వామి కూడా ఆంజనేయ దర్శనం పొందారు! ఇలా ఎన్నెన్నో కథనాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం అత్యంత ఆశ్చర్యకరం! ఎందుకంటే, వాళ్లు యోగులు, సాధువులు కాదు! అయినా 41ఏళ్లకు ఓ సారి రామదూత తనంత తానుగా వారి కోసం వస్తాడు. అప్పుడున్న తరానికి మరోసారి బ్రహ్మజ్ఞానం బోధించి వెళతాడు! అటువంటి స్వచ్ఛమైన తెగ వాళ్లది! ఇంతకీ వాళ్ళు ఎవరు అంటారా? శ్రీలంక అడవుల్లో ఈనాటికీ నివాసం ఉంటున్న మాతంగ తెగ. రావణుడు పాలించిన రాజ్యమే లంక! అదే ఈనాటి శ్రీలంక. అందులోని దట్టమైన అటవి ప్రాంతంలో ఉంటారు వైదా తెగవారు. వీళ్లనే మాతంగులు అని కూడా పిలుస్తుంటారు. వీళ్లకి గురువు మరెవరో కాదు… సీతాన్వేషణ కోసం వచ్చిన ఆంజనేయుడే! త్రేతాయుగం నుంచీ ఇప్పటి వరకూ వీళ్లకు హనుమంతుడు అవసరం వచ్చినప్పుడల్లా దివ్య జ్ఞానం బోధిస్తూ వస్తున్నాడు!
ఇలా ప్రతీ 41ఏళ్లకు వీళ్ల వద్దకొచ్చే హనుమంతుడు అందరికీ కనిపించడు. కేవలం ఈ తెగకు సంబంధించిన అత్యంత పవిత్రులు, ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన వారు మాత్రమే ఆ అపర రుద్రాంశ సంభూతుడ్ని చూడగలరు!మాతంగ తెగ వారి మరో విశేషం ఏంటంటే… వాళ్ల వద్దకొచ్చి ఆంజనేయుడు ఏం చెప్పాడో… అదంతా రికార్డ్ చేసి పెడతారు! ఈ తెగ వారి నాయకుడు ఆంజనేయుడితో మాట్లాడిందంతా ఓ పుస్తకలంలో రాసి పెడతారు! అలాగే మారుతి ఏం చెప్పాడో… ఆ అలౌకిక జ్ఞానం కూడా పుస్తకంలో వుంటుంది! ఇలా రాసిపెట్టిన ఈ గ్రంథంపై అధ్యయనం కూడా జరుగుతోంది! మాతంగులు తమ మాతృ భాషలో రాస్తుంటారు. రాను రాను ఈ భాషను అర్ధం చేసుకోగలిగిన వారు చాలా తక్కువ మంది మిగులుతున్నారు!మాతంగుల తెగకే చెందిన వారు ఇంకా చాలా తీర ప్రాంతాల్లో , అనూరాధ పురంలో వున్నారు. కానీ, హనుమంతుడు వచ్చి కనపడేది వీళ్లందరికీ కాదు. తమిళులతో కానీ, స్థానిక సింహళీ జాతీయులతో కానీ పెద్దగా సంపర్కం లేని స్వచ్ఛమైన ఆటవిక మాతంగులకే కనిపిస్తాడు. వాళ్లు దట్టమైన అడవి మధ్యలోనే పుడతారు. సహజంగా జీవిస్తారు. అక్కడే చనిపోతారు. వారికి ప్రకృతితో తప్పితే ఇంకెవ్వరితో సంబంధం ఉండదు. హనుమంతుని దృష్టిలో వారికే బ్రహ్మ జ్ఞానం పొందే అర్హత వుంటుందట!ఇంతకీ… హనుమంతుడు 41ఏళ్లకు ఒక్కసారి రావటం నిజమేనా? అది తెలియాలంటే 2055 వరకూ ఆగాల్సిందే! ఎందుకంటే, 2014లోనే ఆంజనేయుడు చివరిసారి మాతంగ తెగ వార్ని కలిసి వెళ్లాడట. మళ్లీ ఎప్పుడు దర్శనమిస్తాడో… ఖచ్చితంగా చెప్పలేం! మరి ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.