ప్రస్తుతం దేశంలో సామాన్యుడిని వణికిస్తున్న అంశం ఏదైనా ఉందయ్యా అంటే అది పెట్రోల్ రేటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ రూ.100 కూడా దాటిపోయింది. దీంతో.., వాహనదారులపై రోజురోజుకి భారం పెరుగుతూ పోతోంది. కానీ.., మీకు తెలుసా? ప్రతి దేశంలోనూ పెట్రోల్ రేట్లు ఇలా మరీ అధికంగా ఉండవు. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ రూ.10 కన్నా తక్కువే అంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి పెట్రోల్ రేటు అతి తక్కువగా ఉన్న దేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. పెట్రోల్ తక్కువ రేటుకే లభించే దేశాల లిస్ట్ లో వెనిజులా మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో అత్యంత భారీగా చమరు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఒక బాటిల్ నీరు కొనుక్కోవడం కన్నా.., లీటరు పెట్రోలు కొనుక్కోవడం చవక అంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఇక్కడ లీటరు పెట్రోలు ఎంతో తెలుసా? 0.02 డాలర్లు మాత్రమే. అంటే మన డబ్బుల్లో చెప్పుకోవాలంటే ఒక్క రూపాయి నలభై ఐదు పైసలు మాత్రమే.
2. ఇరాన్ అంటే ప్రపంచదేశాలకి గుర్తుకి వచ్చేది చమురు నిల్వల గురించే. ఇరాన్ నుండి ప్రపంచ దేశాలకి రోజుకు 2.7 మిలియన్ల బ్యారెల్స్ చమురు ఎగుమతులు జరుగుతుంటాయి. కాబట్టి.., స్థానికంగా పెట్రోలు వంటి ఇంధనాలకు కొరత లేదు. ఇక్కడ లీటరు పెట్రోలు 0.06 డాలర్లు మాత్రమే. అంటే 4 రూపాయల 34 పైసలు అనమాట.
3. ఇక ఆఫ్రికా దేశం సూడాన్లో కూడా పెట్రోలు చవకే. ఎందుకంటే ఈ దేశ ప్రధాన ఆర్ధిక వనరు చమురు ఉత్పత్తి కావడమే. నిజానికి సూడాన్ అందరికన్నా ఆలస్యంగా ఈ బిజినెస్లో దిగింది. 1999 నుండి సూడాన్ చమురు ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ లీటరు పెట్రోలు ధర మన కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ.31.85 పైసలు మాత్రమే.
4. ఆయిల్ బావులకు ప్రసిద్ధి గాంచిన దేశం అంటే ముందుగా గుర్తుకొచ్చేది కువైట్. ప్రస్తుతం ఇక్కడ 94 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయి. అందుకే ఇక్కడ పెట్రోలు ధర ఎక్కువ ఉండదు. కేవలం 0.38 డాలర్లు అంటే సుమారు రూ.27.51పైసలు మాత్రమే.
5. ఆఫ్రికాలో అతిపెద్ద గ్యాస్ ఎగుమతి దేశం అంటే అల్జీరియా పేరు వినిపిస్తుంది. చాలా మందికి తెలియని అంశం ఏమిటంటే చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, టర్కీ తదితర ప్రధాన దేశాలన్నింటికీ ఇక్కడి నుంచి గ్యాస్ దొరుకుతుంది. ఇక్కడ కూడా పెట్రోలు ధర తక్కువే. కేవలం 0.34 డాలర్లు మాత్రమే. అంటే మన డబ్బుల్లో రూ.25 లోపే అనమాట.
ఇవి మాత్రమే కాకుండా ఈక్వెడార్, నైజీరియా, ఈజిప్టు, తుర్కమెనిస్తాన్ అజెర్బైజాన్ వంటి దేశాల్లో కూడా పెట్రోల్ రేటు అతి తక్కవే ఉంటుంది. కానీ.., ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చమురు ఉత్పత్తి చేసే దేశాలు. అందుకే ఇక్కడ పెట్రోలు ధర తక్కువ. కానీ.., మనం మాత్రం పెట్రోల్ ని దిగుమతి చేసుకుంటున్నాము. ఇందుకే మన దగ్గర పెట్రోల్ రేటు భగ్గుమంటుంటాయి. కానీ.., వీటికి మన ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ లు కూడా భారీగా ఉంటున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.