నాలుగేళ్ళ పిల్లలకు జాబు అంట, మంచి జీతం కూడా అంట. ఏవండి ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళకే దిక్కు లేదు, అలాంటిది నాలుగేళ్ళ లోపు పిల్లలకి జాబు అంటే ఎలా నమ్ముతాం అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. జపాన్‌లోని ఓ నర్సింగ్ హోం ఈ అవకాశం కల్పిస్తుంది. కొంచెం ఊహ తెలిసిన పిల్లలు హోం వర్కే చేయరు, అలాంటిది నాలుగేళ్ళ లోపు పిల్లలు ఆఫీస్ వర్క్ చేస్తారా? అని ప్రశ్నలు తలెత్తడం సహజమే. కానీ ఈ పిల్లలు తమకి వచ్చిన పని, తెలిసిన పని చేస్తే చాలు. అదేంటంటే ఆడుకోవడం, బోసి నవ్వు నవ్వడం, అల్లరి చేయడం. ఇవే ఇవి చేస్తే నెల నెలా జీతమిచ్చేస్తారు.
దక్షిణ జపాన్‌లోని కిటక్యుషు సిటీలో ఉన్న ఓ నర్సింగ్ హోంలో చాలా మంది వృద్ధులు ఉంటున్నారు. వీరిలో చాలా మంది 80 ఏళ్లు పైబడిన వారే. అయితే వీరికి కాలక్షేపం కోసం, ఒత్తిడిని దూరం చేయడం కోసం ఒక వినూత్న ఆలోచన చేశారు. చిన్న పిల్లలను వృద్ధుల దగ్గర ఉంచితే మానసిక ప్రశాంతత కలుగుతుందని భావించి.. నాలుగేళ్ళ లోపు 30 మంది చిన్నారులను రిక్రూట్ చేసుకున్నారు. దీంతో వృద్ధులు చిన్న పిల్లల్లా పిల్లలతో కలిసి గడుపుతున్నారు. ఈ పిల్లలు నవ్వులు, ఆటలు చూసిన వృద్ధులకి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తమ పిల్లల బాల్యం గుర్తుకొస్తున్నాయని వృద్ధులు అంటున్నారు. ఇక ఈ జాబ్‌కి చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంటారు నర్సింగ్ హోం నిర్వాహకులు.
అయితే పిల్లలకి ఇష్టమైనప్పుడే నర్సింగ్ హోంకి వచ్చేలా వెసులుబాటు కల్పించారు. ఆఫీస్‌కి వచ్చాక మూడ్ లేకపోయినా, ఆకలి వేసినా, నిద్ర వచ్చినా మధ్యలో బ్రేక్‌లు తీసుకోవచ్చు. అయితే వృద్ధులని నవ్వించి, మానసిక ఒత్తిడిని దూరం చేసి, వారి జీవితంలో కొత్త జ్ఞాపకాలను పోగేసి ఇంత చేస్తున్న ఈ చిన్నారులకి ఇచ్చే జీతం ఎంతో తెలుసా? పాల పొడి, న్యాపీలు అంతే. పాపం ఈ వయసులో వారు మనుమలు, మనవరాళ్లు లేని లోటుని తీరుస్తుంటే పాల పొడి, న్యాపీలు ఇవ్వడం ఏంటి అని తిరుగుబాటు చేయకుండా.. తమ పిల్లలకి కూడా నాన్నమ్మ, తాతయ్యలు దొరికారని పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ప్రతీ చోటా వస్తే బాగుంటుంది కదా. మరి నాలుగేళ్ల లోపు పిల్లలకి ఉద్యోగమిచ్చి, వృద్ధులకు సేద తీరుస్తున్న నర్సింగ్ హోంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Southern Japan is “hiring” babies for a very important job – to make its elderly residents happy
Details: https://t.co/2GKxHB0zCB#SamaaTV #Japan pic.twitter.com/7D3WgzNFus
— Samaa English (@SamaaEnglish) August 30, 2022