జపాన్‌లో అందరూ అమ్మాయిలే ఉన్న ‘గర్ల్ బ్యాండ్’ ఒకటి ఉంది. ఈ బ్యాండ్ పేరు కెబిజి 84. ఇందులో చేరి పాదం, పదం కలపాలంటే కనీసం ఎనభైయ్యేళ్ల వయసు ఉండాలి. ఈ బామ్మల బ్యాండ్‌కు ‘పాప్ ఐడోల్స్’ అని వీళ్లని ముద్దుగా పిలుచుకుంటారు. మారుమూలగా విసిరేసినట్టు ఉండే ‘కొహమా’ ద్వీపవాసులు వీళ్లంతా. సింగర్లు, డాన్సర్లు కలిపి 33 మంది ఉన్న ఈ ట్రూప్ చేసిన ‘‘కమాన్ అండ్ డాన్స్, కొహమా ఐలాండ్’’ హృదయాలను కదిలిస్తుంది. కొహమా ద్వీపానికి యువజంటలు హనీమూన్‌కి వెళ్తుంటారు. 600 మంది జనాభా ఉన్న ఈ ద్వీపం తైవాన్‌కు 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా ఈ వయసులో నడుం వంగిపోయి, చేతికర్ర సాయంతో నడుస్తున్న వాళ్లని చూస్తుంటాం. ఒక పక్క సంప్రదాయ సంగీతం ఒకినావన్ మంద్రంగా వినిపిస్తుండగా టోక్యోస్టయిల్ పాప్‌మేకోవర్ చేసుకుని ప్రేక్షకులను ఉత్సాహపరుస్తారు.
ఒకినావాన్ ద్వీప ప్రజల జీవితకాలం మిగతా ప్రపంచంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ. ఇందుకు కారణం ఆహారపు అలవాట్లే అంటారు వాళ్లు. ఎక్కువ కూరగాయలు తింటారు. జపాన్‌తో పోలిస్తే చాలా తక్కువ పంచదార వినియోగిస్తారు. బియ్యం కంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో పండే ఊదారంగు స్వీట్ పొటాటోస్ తింటారు. ఇదే వాళ్లకు ప్రధాన ఆహారం. ఎనభైయ్యవ పడిలో ఉన్న ఈ బ్యాండ్ సభ్యురాళ్లంతా ఇంటిపనులన్నీ స్వయంగా చేసుకుంటారు. షోకి వచ్చిన ప్రేక్షకుల మోము మీద ఉండే చిరనువ్వులు శక్తినిస్తాయి. శక్తితోనే మా హృదయాలను పాట రూపంలో పరుస్తున్నాం.
కొహమాలో జన్మించడం నిజంగా మా అదృష్టం. మా పాటలోని పదాలన్నీ మా ద్వీపం గురించి, ప్రకృతి గురించే. చిన్న పిల్లల్లానే మా మధ్యా గొడవలు వస్తుంటాయి. అయితే వాటినుంచి వెంటనే బయటికొచ్చేసి హాయిగా మాట్లాడుకుంటాం. మా అందరిదీ ఒకే హృదయం. మనుషులం మాత్రమే వేరు అంటూ ఈ తరం కుర్రకారుకి పెద్ద సవాలే విసురుతున్నారు ఈ బామ్మలు .