దేశంలోని పౌరుల్లో ఎక్కువమంది తుపాకులు కలిగి ఉండాలని ఒక దేశ ప్రభుత్వం అంటోంది. అంతేకాదు దీన్ని అమల్లో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటోంది.
పోలీసుల దగ్గర తుపాకులను చూసుంటారు. సరిహద్దుల దగ్గర పహారా కాసే సైనికులు, భద్రతా సిబ్బంది వద్ద కూడా గన్స్‌ను చూసుంటారు. ప్రజా భద్రత, దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ఆర్మీతో పాటు ఇతర భద్రతా సిబ్బందికి గన్స్ ఇస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ అదే పౌరుల దగ్గర గన్స్ ఉంటే? అవును, యూఎస్ లాంటి చోట్ల గన్ కల్చర్ పెరిగిపోతోందని వార్తల్లో చూస్తున్నాం. అయితే అక్కడి ప్రభుత్వం ప్రజల చేతుల్లో తుపాకులు పెట్టడం లేదు. కానీ ఇజ్రాయెల్‌లో అలా కాదు.. అక్కడి సర్కారు పౌరులకు గన్స్ ఇస్తోంది. ఇజ్రాయెల్‌లో ఇటీవలే కొలువైన రైట్ వింగ్ సర్కారు.. అక్కడి జనాభాలో ఎక్కువ మంది తుపాకులు కలిగి ఉండాలని కోరుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడే ప్రభుత్వం పౌరుల చేతికి తుపాకులు ఎందుకిస్తోందనే కదా మీ అనుమానం. దాని వెనుకో కారణం ఉంది.
గత ఏడాది కాలంలో ఇజ్రాయెల్‌లో ప్రాంతీయ హింస పెచ్చుమీరిపోయింది. ప్రభుత్వం తమకు రక్షణ కల్పిస్తుందనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. దీంతో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. దాడులు, భద్రతాపరమైన ఘటనలతో గన్ లైసెన్సుల కోసం ఆసక్తి చూపడం అక్కడ ముందు నుంచి ఉంది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలెంల్లో హింస ఎక్కువగా జరుగుతోంది. గతేడాది ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ బలగాల చేతుల్లో 148 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మిలిటెంట్లు, సామన్య ప్రజలు, సాయుధులు ఉన్నారు. మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి.
వీటిలో చాలా దాడులు జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అక్కడ సాయుధులు ప్రతిఘటిస్తుండటంతో ఆయా ప్రాంతాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యానికి మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారు. అయినా ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మిలిటెంట్ గ్రూపులను బలహీనపర్చడానికి ఆపరేషన్ కొనసాగించాల్సిందేనని ఆ దేశ సర్కారు అంటోంది. అయితే ప్రజలు స్వీయరక్షణ కోసం గన్స్ కొనుక్కోవాలని అంటోంది. ఈ దాడులు ముగిశాక గన్ లైసెన్సుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్గవిర్ చెప్పారు. లైసెన్సుల సంఖ్యను 2 వేల నుంచి 10 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. పౌరుల చేతుల్లో మరిన్ని తుపాకులు ఉండాలని ఆయన వివరించారు. అప్పుడు వాళ్లు ఆత్మరక్షణ చేసుకోగలరన్నారు.