మోహ్‌సెన్ ఫక్రిజదెహ్ మమబది.. ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్‌గా పేరుగాంచారు. ఈయన గతేడాది నవంబర్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన తీరు ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. దాని కారణం అందుకోసం వాడిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కూర్చోని టార్గెట్ చేసిన వ్యక్తిని మాత్రమే చంపే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హత్య జరిగింది. వివరాలు.. నవంబర్ 27, 2020న కాస్పియన్ సముద్ర తీరంలోని ఇంటి నుంచి తూర్పు టెహ్రాన్‌లోని అబ్జార్డ్ ఇంటికి ఎస్కార్ట్ మధ్య మోహ్‌సెస్ బయలుదేరారు.
కాసేపట్లో ఇంటికి చేరుతారనే సమయానికి ఓ సిగ్నల్ దగ్గర ఆయనపైకి తుటాలు సంధించారెవరో. ప్రమాదంలో మెహ్‌సెన్ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. అలా మెహ్‌సెన్‌ను మాత్రమే మట్టుపెట్టాలనే లక్ష్యాన్ని ప్రత్యర్థులు పూర్తి చేశారు. ఈ హత్యకుట్రలో టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్‌ఎన్ ఏంఏజీ మెషిన్ గన్‌ను దాడికి ఉపయోగించినట్లు సమాచారం. ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహ్‌సెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్‌ను పూర్తి చేసింది.
ఇంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడి ఆయనను ఎవరు, ఎందుకు హత్య చేసి ఉంటారనేది ఇప్పటికి తెలియలేదు. అమెరికా-ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. 2020 సమ్మర్ నుంచి ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మోస్సాద్ టీం, మెహ్‌సెన్ హత్యకుట్రకు ప్రణాళిక అమలు చేసిందనేది ప్రధాన ఆరోపణ.