కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోనూ వెలుగుచూడటం కలకలం రేపింది. అయితే హిజాబ్‌పై వివాదం భారత్‌లోనే కాదు.. ఇరాన్ లాంటి ఇస్లాం దేశంలోనూ జరుగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ హిజాబ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు 10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది.
హిజాబ్‌కు, వీరికి జైలు శిక్ష విధించడానికి మధ్య సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. అసలు విషయానికొస్తే.. అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ అనే బ్లాగర్ జంట ఇరాన్‌లో హిజాబ్ నిరసనకారులకు మద్దతుగా టెహ్రాన్‌లోని ఆజాదీ స్క్వేర్ వద్ద డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలో అస్తియాజ్ హగిగి హిజాబ్ ధరించకుండా నృత్యం చేస్తూ కనిపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇరాన్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ జంటను నవంబర్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు.
అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీలు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీకి హాని కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రెవెల్యూషనరీ కోర్టు ఆరోపించింది. వీరి ఆన్ లైన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా కోర్టు నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్ చేసినందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహించారన్న అభియోగాలతో కోర్టు వారిద్దరినీ దోషులుగా నిర్ధారించింది. ఈ కపుల్స్‌కు జైలు శిక్షతో పాటు సైబర్ స్పేస్‌ను వాడుకున్నందుకు రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో పాటు బహిరంగంగా డ్యాన్స్ చేయడం మీద రెండేళ్ల పాటు ఇరాన్ నుంచి వాళ్లిద్దరినీ బహిష్కరిస్తూ కోర్టు ఊహించని తీర్పునివ్వడం గమనార్హం.
A court in #Iran sentenced a couple to 10.5 years in prison for dancing in the street, the Al Arabiya newspaper reported.
They were accused of conspiring to undermine national security and engaging in anti-regime propaganda. pic.twitter.com/EWrsSgohQs
— NEXTA (@nexta_tv) January 31, 2023