అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ.. ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఓ సరికొత్త నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2022 మహిళా దినోత్సవం వేడుకలను.. ‘‘సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. ఇంకా చెప్పాలంటే ‘‘రేపటి మహిళలు” అనే నినాదంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ట్వీట్ చేసింది.
‘‘ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది. ప్రపంచంలో 21వ శతాబ్దంలో అతి పెద్ద సవాళ్ళలో పర్యావరణ, విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు. దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధికి మించినది” అని ఐక్యరాజ్య సమితి మహిళా వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాదు “ఈ సంవత్సరం వాతావరణ మార్పుల గురించి.. వాతావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న, నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గౌరవించనున్నట్లు’’ పేర్కొంది.
📌 SAVE THE DATE 📌
Join us for the @UN Observance of #InternationalWomensDay 2022, as we recognize the women and girls who are leading the charge on #ClimateAction towards a sustainable future.
🌱8 March 2022
🌱10:00 a.m. ESTRSVP: https://t.co/eFFGOBBh9B#IWD2022 #WHM
— UN Women (@UN_Women) March 2, 2022
మహిళా దినోత్సవ చరిత్ర..
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వందేళ్లు దాటిన గొప్ప చరిత్ర ఉంది. 1908 సంవత్సరంలో మహిళలకు తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15 వేల మంది మహిళలు భారీ ప్రదర్శన చేశారు. మహిళల ఈ డిమాండ్లను గుర్తించి అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1910 సంవత్సరంలో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ కోపెన్ హాగన్ సమావేశంలో మహిళా దినోత్సవానికి అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ఆ సమయంలో మహిళలందరికీ ఓటు హక్కు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
తొలిసారిగా మహిళా దినోత్సవం..
నిజానికిమొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్ అంతటా నిర్వహించారు. అనంతరం 1911లో.. మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ , స్విట్జర్లాండ్ దేశాలు మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపాయి. 1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును అధికారిక సెలవు రోజుగా ప్రకటించారు. మరోవైపు 1917 యుద్ధం వేళ రష్యాలోని మహిళలు ఆహారం-శాంతి కోసం డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా రాజు నికోలస్ జార్ సింహాసనాన్ని వీడారు. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది.
మార్చి 8న..
1917 యుద్ధం వేళ రష్యా మహిళలు సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం, ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8వ తేదీన వచ్చింది. అందుకే ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. మొదటి ఏడాది “గతాన్ని జరుపుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళిక”గా నినాదాన్ని ప్రకటించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చూచించే రంగులు..
ఊదా, ఆకుపచ్చ, తెలుపు అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని సూచించే రంగులు. ఊదా రంగు న్యాయం , గౌరవాన్ని సూచిస్తుంది, ఆకుపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం ప్రకారం.. రేపటి మహిళలైనా వివక్ష లేని సమాజాన్ని చూడగల్గుతారా లేదా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.