పాకిస్తాన్భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్‌పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. అసలే భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. సాంకేతిక లోపం వల్లే భారత మిస్సైల్ పాకిస్థాన్ భూభాగంపైకి వెళ్లిందని పేర్కొంది.
ఈ విషయం పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే తమ దేశం ఘాటుగా ప్రతిస్పందించగలిగేదని అన్నారు. కానీ తాము అలా చేయలేదని.. ఓపిక పట్టామని చెప్పారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను, దేశాన్ని శక్తిమంతం చేసుకుంటామని పేర్కొన్నారు. కాగా, పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ పైవిధంగా స్పందించారు. మరోవైపు భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కానీ భారత్ స్పందనపై పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వివరణ సరిగా లేదని, ఘటనపై ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది.