డ్రంక్ అండ్ డ్రైవ్.. మందు తాగి డ్రైవింగ్ చేసే వాళ్లు ఉగ్రవాదులతో సమానం అని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ఎంత చెప్పినా, ఎన్నిచోట్ల చెకింగ్‌లు చేసినా కూడా మద్యం సేవించి బండి నడిపేవారిని కట్టడి చేయలేకపోతున్నారు. అయితే చెకింగ్ చేస్తూ జరిమానాలు విధించినా కూడా చాలా మందిలో మార్పు కనిపించడం లేదు. మీరు మద్యం తాగి వాహనం నడిపితే మీ వల్ల మరో ప్రాణం రిస్క్‌లో పడినట్లే. బార్‌కి, పబ్‌కి వెళ్తే సొంత వాహనం కాకుండా క్యాబ్‌లో, ఆటోలో వెళ్లాలని చెబుతూనే ఉన్నారు. కానీ, ఎవరూ వినే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఈ జీవితంలో మళ్లీ మందుతాగి స్టీరింగ్ పట్టుకోడు. ఎందుకంటే అతనికి వేసిన ఫైన్ ఆ రేంజ్‌లో ఉంది మరి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టబడగా అతనికి రూ.5.5 లక్షల జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. బుర్ దుబాయ్ సమీప ప్రాంతంలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుని ఢీకొట్టాడు. అయితే ఆ ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అతడు చేసిన నేరానికి జడ్జి 25 వేల దిర్హమ్స్ జరిమానాగా వేశారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.56 లక్షలకు పైగానే ఉంటుంది. అలాగే అతడు రెండ్రోజులపాటు కస్టడీలో కూడా ఉన్నాడు. తర్వాత అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు.
ఆగస్టు 18న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో ట్రాఫిక్ రూల్స్ ని చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం సేవించి కారు నడిపితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 వేల దిర్హమ్స్ జరిమానా వేస్తారు. అలాగే జైలుశిక్ష కూడా వేస్తూ ఉంటారు. అలాగే 60 రోజులపాటు వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు. అక్కడితో అయిపోలేదు ఇంక డ్రైవింగ్ లైసెన్స్ ని 3 నెలల నుంచి రెండేళ్లపాటు రద్దుచేసే అవకాశం కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. భారత్‌లో కూడా ట్రాఫిక్ రూల్స్ అంతే కఠినంగా మార్చాలంటూ కోరుతున్నారు. అలా అయితే రూల్స్ ని అతిక్రమించాలంటే భయపడతారంటూ చెబుతున్నారు.