అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన అందాల పోటీల్లో ఇండో అమెరికన్ టీనేజర్ ఆర్యవాల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ-2022 కిరిటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో వర్జీనియాకు చెందిన 18 ఏళ్ల ఆర్య వాల్వేకర్ విజేతగా నిలవగా.. ఫస్ట్ రన్నరప్‌గా వర్జీనియా వర్సిటీ పారామెడికల్ విద్యార్థిని సౌమ్య శర్మ, సెకండ్ రన్నరప్‌గా న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి నిలిచారు.
ఈ సందర్భంగా ఆర్య వాల్వేకర్ మాట్లాడుతూ.. ఇప్పటికి తన కల నెరవేరిందని.. చిన్ననాటి నుంచి తనకు వెండితెరపై కనిపించాలనే కోరి ఉందని.. తనను తాను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో పనిచేయాలనేది నా కోరిక అన్నారు. అలాగే కొత్త ప్రదేశాలను సందర్శించడం, వంట చేయడం, డిబేట్లలో పాల్గొనడం తనకు అలవాటన్నారు. తనకు సహకరించిన అందరికీ.. కృతజ్ఞతలు తెలిపారు.
ఇక మిస్ ఇండియా యూఎస్ పోటీలు ప్రారంభించి ఈ ఏడాదితో 40 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా వరల్డ్ వైడ్ పేజెంట్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ధర్మాత్మ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కమ్యూనిటీ మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు.. ఈ ఏడాది మూడు వేర్వేరు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అమెరికాలోని 30 రాష్ట్రాల నుంచి మొత్తంగా 74మంది పాల్గొన్నట్లు తెలిపారు.