రాజమౌళి ఈగ సినిమా గుర్తుందా.. హీరో ఆత్మ ఓ ఈగలో ప్రవేశించి.. తనను చంపిన వాడికి చుక్కలు చూపుతుంది. ఆఖరికి.. విలన్‌ను చంపి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది సినిమా కాబట్టి.. మన దగ్గర ఆత్మ-ప్రతీకారం వంటి కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది కనుక.. ఈ సినిమాలో ఈగని మనం హీరోగా యాక్సెప్ట్ చేశాం. మరి వాస్తవంగా ఇలా జరుగుతుందా అంటే అస్సలు అవకాశమే లేదంటాం. కానీ ఈ వార్త చదివితే.. ఆశ్చర్యంతో ఓర్ని ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ఓ ఇంట్లో దూరాడు. అందినకాడికి దోచుకున్నాడు. ఆ తర్వాత తీరిగ్గా నచ్చిన ఆహారం వండుకుని తిని.. దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే నిద్రపోయాడు. అయితే ఆ ఇంట్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. మస్కిటో కాయిల్స్ వెలిగించినా సరే.. అవి పోలేదు. దాంతో విసుగొచ్చి.. చేతికి చిక్కిన దోమలను చంపుకుంటూ పోయాడు. అలా చచ్చిన దోమలు.. ఆ దొంగను పోలీసులకు పట్టించాయి. అదేలానో తెలియాలంటే.. ఇది చదవండి..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్కథనం ప్రకారం.. గత నెల జూన్ 11వ తేదీన ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఫుజౌలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి దొంగ చొరబడ్డాడు. బాల్కనీ నుంచి ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లోని వస్తువులను దొంగిలించడమే కాకుండా.. డిన్నర్ కూడా తయారు చేసుకున్నాడు. గుడ్లతో నూడుల్స్ వండుకుని తిన్నాడు. ఆ రాత్రి అక్కడే కాసేపు గడిపాడు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయాడు. దోమల బెడద ఎక్కువగా ఉండటంతో మస్కిటో కాయిల్స్ వెలిగించాడు. అయినా సరే దోమలు వెళ్లలేదు. అతడిని రాత్రంతా కుడుతూనే ఉన్నాయి. దీంతో విసుగొచ్చి చేతికి అందిన దొమను చంపుకుంటూ పోయాడు.
తెల్లవారుజామున ఆ దొంగ నిద్రలేచి వెళ్లిపోయాడు. ఉదయం ఇంటికి వచ్చిన ఆ ఇంటి యజమాని బాల్కానీ తలుపులు తెరిచి ఉండటంతో తన ఇంట్లో చోరీ జరిగిందని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అన్నీ తనిఖీ చేశారు. అక్కడ వారికి చనిపోయిన దోమలు కనిపించాయి. గొడకు అతుక్కుని చనిపోయిన రెండు దోమల నుంచి వచ్చిన రక్తాన్ని పోలీసులు సేకరించారు. ఆ రక్తపు నమూనాలను టెస్టుల కోసం పంపారు. డీఎన్ఏ పరీక్షల్లో ఆ రక్తం ఎవరిదో తెలిసిపోయింది.
దోమలో దొరికిన రక్తం డీఎన్ఏను నేరగాళ్ల డీఎన్‌ఏతో పోల్చి చూశారు. చివరికి చాయ్ అనే వ్యక్తి డీఎన్ఏతో అది మ్యాచ్ అయ్యింది. దీంతో పోలీసులు అనుమానితుడి గురించి గాలించేశారు. దొంగతనం జరిగిన 19 రోజుల తర్వాత పోలీసులు చాయ్‌ను అరెస్టు చేశారు. అతడిని పట్టుకున్న తర్వాత మరో మూడు దొంగతనం కేసుల్లో కూడా అతడే నిందితుడని తేలింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దోమలు ఇలా కూడా దొంగలను పట్టిస్తాయా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అతడి చేతిలో చనిపోయిన దోమలు.. ఇలా ప్రతీకారం తీర్చుకున్నాయని కొందరు కామెంట్ చేశారు. అంతేకాదు.. ఇక మీదట ఊరెళ్తే.. ఇంట్లో దోమలను కాపలా ఉంచితే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని మన దేశంలో కూడా తీసుకురావొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.