భాతర్ పై అస్తమాను తన అక్కసును వెళ్లగక్కుతుంటోంది పరాయి దేశం పాకిస్తాన్. జమ్ము కాశ్మీర్ సమస్య నుండి ఉగ్రవాదం ఇతర అంశాలపై ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఉప్పు, నిప్పుగా ఉంటాయి భారత్, పాక్‌లు. భారత్‌పై అస్తమాను తన అక్కసును ప్రదర్శిస్తుంటుంది పాకిస్తాన్. జమ్ముకాశ్మీర్ సమస్య నుండి ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తుంటుంది దాయాది దేశం. కయ్యానికి కాలు దువ్వే ఈ దేశం.. అంతర్జాతీయ వేదికలపై కూడా భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. పలుమార్లు భారత్ నుండి చీవాట్లు ఎదురైనా.. తన పంథాను మార్చుకోదు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాక్. అయితే మాజీ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
భారత్, దేశ ప్రధానిని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తారు. భారత దేశ విదేశాంగ విధానాన్నిమరోసారి కొనియాడారు. భారత్‌లా రష్యా ముడి చమురును తమ దేశం కూడా చౌకగా పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. అయితే తన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోవడంతో అలా చేయలేకపోయామని చెప్పారు. జాతినుద్దేశించి ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు తన ప్రభుత్వం పడిపోవడంతోనే అది జరగలేదన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగుతన్నప్పటికీ.. భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసిందని, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయగలదా అంటూ విచారం వ్యక్తం చేశారు.
పాశ్చాత్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తమ దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే దిశగా రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్ ముందుకు వచ్చిందంటూ ఖాన్ ప్రశంసించారు. ఆయన ఇలా ప్రశంసించడం ఇది మొదటి సారి కాదూ. 2022లో అగ్రరాజ్యం అమెరికా నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయాలన్న భారత్ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యాతో పాకిస్తాన్ చౌకగా చమురు రవాణా ఒప్పందం ఖారారు చేసుకుందని, వచ్చే నెలలో మొదటి షిప్‌మెంట్ కార్గో ద్వారా ఆ దేశానికి చేరుకుంటుందని పేర్కొనడం గమనార్హం.