ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అన్న రీతిలో.. మొన్న మొన్నటి వరకు రాజ భోగాలు అనుభవించిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
గతేడాది అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవి కోల్పోయినప్పటి నుంచి పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి దయనీయంగా మారింది. పొలిటికల్ గేమ్ లో భాగంగా పలు కేసులు ఇమ్రాన్ ను చట్టు ముట్టగా.. తోషా ఖానా కేసులో ఇమ్రాన్ దోషిగా తేల్చిన ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు.. మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఐదేళ్ల పాటు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో ఎందరో ప్రముఖులు జైలు జీవితం గడిపినా.. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి మరింత భిన్నంగా కనిపిస్తోంది. ప్రధాని హోదాలో నిత్యం వివిధ రంగాల నిపుణులు, బిజినెస్ టైకూన్స్ తో చర్చలు జరిపిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కటకటాల వెనుక కరుడు గట్టిన నేరస్థుల మధ్య కాలం వెల్లదీస్తున్నారు.
ప్రధానిగా ఉన్నప్పుడు తనకు వచ్చిన బహుమతులను తోషా ఖానా లో జమ చేసిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వా త వాటిని అతి తక్కువ ధరతో అక్రమంగా చేజిక్కించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటి విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు వాటిని నిజమని తేల్చడంతో ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల శిక్ష పడింది. నిబంధనల ప్రకారం ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చిన బహుమతులను సగం ధర చెల్లించి సొంతం చేసుకునే అధికారం ప్రధాన మంత్రికి ఉన్నా.. ఇమ్రాన్ మాత్రం కేవలం కొద్ది పాటి ధనంతోనే విలువైన బహుమతులను హస్తగతం చేసుకున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.గతేడాది మే నెలలోనే ఇమ్రాన్ ఖాన్ ను కస్టోడియల్ కండిషన్ పై అదుపులోకి తీసుకున్నప్పుడ.. ఓ గెస్ట్ హౌస్ లో ఉంచారు. పార్టీ నేతలను కలవడానికి అవకాశం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జైలు కు తరలించారు. సాధారణంగా అటోక్ లో మామూలు నేరస్థులను కాకుండా.. కరడు గట్టిన నేరస్థులను మాత్రమే ఉంచుతారు. అలాంటి చోట ఇమ్రాన్ ను పెట్టారుు. తీవ్రమైన నేరాలతో పాటు ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని ఉంచే జైల్లో ఇమ్రాన్ ను పెట్టడంతో అక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయనే వార్తలు బయటకు వస్తున్నాయి. మన దేశంలో తీహార్ జైలుకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. పాకిస్థాన్ లో అటోక్ జైలుకు అలాంటి గుర్తింపే ఉంది. పాకిస్థాన్ చరిత్రలో మాజీ ప్రధాని స్థాయి వ్యక్తిని అటోక్ జైల్లో ఉంచడం ఇదే తొలిసారి. దీంతో నిత్యం ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపిన ఇమ్రాన్.. ప్రస్తుతం కరుడు గట్టిన ఉగ్రవాదులు, నేరస్థులు, దేశద్రోహులతో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను రాజకీయంగా దెబ్బ తీయాలనుకుంటున్న ప్రత్యర్థులే అయానను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇమ్రాన్ ను ప్రజాక్షేతంలో ఎదుర్కోలేకే కుట్ర పూరితంగా ఇలా పగ తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరి అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా ఒక వెలుగు వెలిగి.. అటు బ్యాట్ తో ఇటు బంతితో దుమ్మురేపిన ఇమ్రాన్ రాజకీయ రంగంలోనూ ఓడిదుడుకులు దాటుకొని బయట పడతారా కాలమే నిర్ణయించాలి.