పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ పీఎం అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని ఇమ్రాన్ చెప్పారు. తనను హత్య చేసేందుకు గతంలో రెండుమార్లు ప్రయత్నాలు జరిగాయన్నారు. అవి విఫలం కావడంతో దేశ నిఘా సంస్థలతో కలసి హత్య చేసేందుకు తాజాగా పథకం పన్నారని ఆయన ఆరోపించారు. లాహోర్‌లోని జమాన్ పార్క్‌లోని తన ఇంటి నుంచి వర్చువల్ విలేకరుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో-చైర్మన్ మీద ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో అసిఫ్ అలీ జర్దారీతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. తనకు ఏదైనా జరిగితే దేశ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ పేర్కొన్నారు.
జర్దారీ వద్ద అవినీతి సొమ్ము చాలానే ఉందని, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఆయన ఆ డబ్బులను వినియోగిస్తున్నారని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తానని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ‘ఇప్పుడు వాళ్లు ప్లాన్ సీ తయారు చేశారు. దీని వెనుక ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నాడు. ఆయన దగ్గర పుష్కలంగా అవినీతి సొమ్ము ఉంది. సింధ్ ప్రభుత్వం నుంచి జర్దారీ కావాల్సినంత దోచుకున్నాడు. దానిని ఎన్నికల్లో గెలిచేందుకు ఖర్చు చేస్తాడు. ఆయన ఓ ఉగ్రవాద సంస్థకు, శక్తిమంతమైన వ్యక్తులకు డబ్బులు ఇస్తున్నాడు. ఏజెన్సీలూ ఆయనకు మద్దతుగా నిలుస్తూ, సాయం చేస్తున్నాయి’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. లాహోర్‌లోని తన ఇంటి వద్ద నుంచి అదనపు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఇమ్రాన్ పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇమ్రాన్ ఇంటి వద్ద మోహరించిన దాదాపు 275 మంది పోలీసులను పాక్ సర్కారు ఉపసంహరించుకుంది.