ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ కేవలం తల్లిది మాత్రమే అని చెప్తారు. తనకు ఏమైనా పర్లేదు.. బిడ్డ సంతోషంగా ఉండాలని తల్లి నిత్యం ఆరాటపడుతుంది. బిడ్డ సంతోషం కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. ఆఖరికి బిడ్డ నిండు నూరేళ్లు బతికేందుకు.. తన ఆయుష్షును ఇవ్వడానికి కూడా వెనకాడదు. అయితే కాలం మారుతున్న కొద్ది తల్లి ప్రేమలో కూడా కల్తీ చోటు చేసుకుంటుంది. తన సంతోషం కోసం కన్నప్రేమను మరిచి.. బిడ్డలను బలి తీసుకుంటున్న తల్లుల గురించి అప్పుప్పుడు చదువుతూనే ఉన్నాం.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నబిడ్డను చంపాలని భావించిన ఓ కసాయి తల్లి.. చిన్నారిని జూలోని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ లోకి విసేరిసింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగలిగింది. ఈ సంఘటన తాష్కెంట్ లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఓ మహిళ మూడేళ్ల తన బిడ్డను తీసుకుని జూకు వచ్చింది. ఎలుగు బంటి ఎన్‌క్లోజర్ దగ్గర నిలబడి.. దాన్ని చూడసాగింది. అప్పటికే ఆ మహిళ మీద అనుమానం వచ్చిన జూ సిబ్బంది ఆమెపై ఓ కన్నేసి ఉంచారు.
వారి కన్ను కప్పి సదరు మహిళ చేతిలోని బిడ్డను ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోకి విసిరేసింది. ఆ ఎన్‌క్లోజర్ పదహారు అడుగుల లోతు ఉండడంతో.. కింద పడ్డ బిడ్డ తలకు గాయమైంది. ఇంతలో జూజూ అనే ఎలుగుబంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి వాసన చూసింది. కానీ, అదృష్టవశాత్తు ఏం చేయకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో ఆరుగురు జూ సిబ్బంది ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. ఆ ఎలుగు బంటిని మరోసారి బిడ్డ దగ్గరికి వెళ్లనీయకుండా.. దారి మళ్లించారు. ఆపై బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
ఆ వెంటనే ఆ కసాయి తల్లిని అరెస్ట్ చేశారు. బిడ్డ ప్రాణం తీసేంత కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. హత్యాయత్నం కింద నేరం రుజువైతే ఆమెకు పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. ఈ ఘటనలో చిన్నారి తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. బిడ్డ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన కసాయి తల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.