ప్రతి దేశానికి సంపదను సమాకూర్చే కొన్ని ప్రత్యేక వనరులు, పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటిల్లో పర్యాటక రంగం ఒకటి. ఈ పర్యాటక రంగం పై ఆధారపడి అనేక దేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో హాకాంగ్ ఒకటి. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా హాంకాంగ్ పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నది. ఈక్రమంలో పునరుద్దరించేందుకు హాకాంగ్ దేశం నడుం బిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పర్యాటకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా ఇస్తామని భారీ ఆఫర్ ప్రకటించింది.
వివిధ రకాల అణిచివేతలు, కోవిడ్ నియంత్రణలతో గత మూడేండ్లుగా దక్షిణ చైనా సిటీ హాంకాంగ్ బాగా చితికిపోయింది. తిరిగి పర్యాటకులను ఆకట్టుకుంటూ ఆర్ధికంగా నిలబడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘హాలో హాంకాంగ్’ పేరుతో ప్రచార హంగామాకు సిద్ధమైంది. హాలో హాంకాంగ్ పేరుతో వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సిటీ ప్రాముఖ్యతను వివరిస్తూ బిల్ బోర్డులు వెలిశాయి. వ్యాపార, పర్యాటక దిగ్గజాల సమక్షంలో ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను అక్కడి అధికారులు ప్రారంభించారు. నగర అందాలను అనుభూతి చెందేందుకు యాత్రికుల కోసం 5 లక్షల ఉచిత విమాన ప్రయాణ టికెట్లు అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం హాంకాంగ్ నేత జాన్ లీ ఈ ప్రమోషన్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించారు. ఈ ఉచిత విమాన టికెట్లను మార్చి నుంచి పర్యాటకులకు అందచేయడం ప్రారంభిస్తారు.
హాంకాంగ్‌లోని ప్రముఖ హార్బర్ పక్కన కొలువుతీరిన మెయిన్ కన్వెన్షన్ సెంటర్‌లో డ్యాన్సర్ల హంగామా, నియోన్ లైట్ల ధగధగల మధ్య ఈ ప్రచారాన్ని లీ ప్రారంభించారు. విదేశీ పర్యాటకులకు మార్చి నుంచి ఆరు నెలల పాటు ఉచితంగా పంచే ఈ విమాన టికెట్లను ప్రభుత్వం హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌లైన్స్ క్యాథే పసిఫిక్‌లకు అందచేయనుంది.అలానే వేసవిలో హాంకాంగ్ వాసులకూ అదనంగా 80 వేల విమాన టికెట్లు అందజేస్తామని హాంకాంగ్ ఎయిర్ పోర్టు అథారిటీ సీఈవో ఫ్రెడ్ లామ్ తెలిపారు. గత వైభవాన్ని పొందేందుకు హాంకాంగ్ సంకల్పించింది. మరి.. హాంకాంగ్ ప్రకటించిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.