ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. అక్కడ ఒక్కరోజులోనే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.35కు పెంచేసింది పాక్ సర్కార్. అదేవిధంగా కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ రేట్లను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచుతున్నట్లు పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. పెంచిన ధరలు వెంటనే నుంచి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మొత్తం నాలుగు రకాల పెట్రో ఉత్పత్తుల మీద రేట్లను పెంచామని దార్ చెప్పారు. ధరల పెంపుతో కలిపి పాకిస్థాన్‌లో లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర రూ.262.80కు చేరింది. అలాగే లీటర్ పెట్రోల్ ధర రూ.249.80కు చేరింది. ఇక లీటర్ కిరోసిన్ ఆయిల్ ధర రూ.189.83కు, లీటర్ లైట్ డీజిల్ ధర రూ.187కు చేరింది. పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని దార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెట్రో దిగుమతుల భారం పెరిగిందని, అందుకే పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్ తర్వాత పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదన్నారు.
పెట్రో ఉత్పత్తులను సరఫరా చేసే ఆయిల్ కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని.. వాటిని చెల్లించకపోవడంతో ఇంధన సరఫరాను నియంత్రించాయని ఇషాక్ దార్ చెప్పుకొచ్చారు. దీంతో దేశంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు భారీగా అడుగంటాయని దార్ వివరించారు. కాగా, రానున్న రోజుల్లో పాక్‌లో పెట్రో రేట్లు మరింతగా పెరుగుతాయని ఎక్స్ పర్ట్ ఫహద్ రౌద్ తెలిపారు. అక్కడ ఆయిల్‌కు కొరత లేదని.. మార్కెట్‌లో కావాలనే కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారని అంటున్నారు. ఇక, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుదలపై పాక్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వానికి దేశాన్ని నడపడం రావడం లేదని.. అందుకే ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఇమ్రాన్ విమర్శించారు. ఇకపోతే, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) త్వరలో అక్కడకు రానుంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా పెట్రో ఉత్పత్తుల మీద ప్రభుత్వం ఇలా ధరలను పెంచేయడం హాట్ టాపిక్‌గా మారింది.