పాక్ మాజీ ప్రధాని మనవరాలు ఫాతిమా తన భర్తతో కలిసి శివాలయానికి వెళ్లారు. అక్కడ శివలింగానికి స్వయంగా పూజలు చేశారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రముఖ రచయిత, ఉద్యమకారిణి.. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి జుల్‌ఫికర్ అలీ బుట్టో మనవరాలు ఫాతిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలిచారు. ఆమె ఓ హిందూ దేవాలయానికి వెళ్లటం.. అక్కడి గుడిలో పూజలు చేయించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఆమె చేసిన పనిని నెటిజన్లు ఎంతో ప్రశంసిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. గత శుక్రవారం ఫాతిమా వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఆమె అమెరికాకు చెందిన గ్రాహం అనే వ్యక్తిని పెళ్లాడారు. పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో కలిసి కరాచీకి వెళ్లారు. ఆదివారం కరాచీలోని పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
భార్యాభర్తలు స్వయంగా శివ లింగానికి అభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఫాతిమా తాత మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను 1979లో సైనిక నియంత జియా ఉల్ హక్ ఉరి తీసి చంపాడు. ఆ తర్వాతినుంచి ఆయన కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు హత్యలకు బలవుతూ ఉన్నారు. 1996లో జుల్ఫికర్ కుమారుడు ముర్తజా భుట్టో హత్యకు గురయ్యారు. 2007లో జుల్ఫికర్ పెద్ద కూతురు బెనజీర్ భుట్టోను హత్యకు గురయ్యారు. 1985లో జుల్ఫికర్ మరో కుమారుడు షానవాజ్ భుట్టో ఫ్రాన్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో శవమై తేలాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మృత్యువాతపడుతూ వచ్చారు.