గత కొన్ని రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఈ వరదల ధాటికి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వరదలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడవ బోల్తాపడి 76 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. పడవ ప్రమాధ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకీ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని ఓగుబరా ప్రాంతంలో సుమారు 85 ప్రయాణికులతో ఓ పడవ నదిలో బయలుదేరింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ పడవ నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 76 మంది మరణించినట్లు అత్యవసర సేవల విభాగం తెలిపింది. ఈ ఘటనపై ఆ దేశాధినేత, ఇతర నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అత్యవసర సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బుహారీ తెలిపారు. ఆయన ఆదేశాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నదిలోని నీటిమట్టం భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో ప్రమాద బాధితులను ఆదుకునేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కఠినంగా మారినట్లు అత్యవసర విభాగం వెల్లడించింది. దీంతో సహాయక చర్యల కోసం నావిదళ హెలికాప్టర్ సాయం కోరామని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణల కోసం దర్యాప్తులు చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అనంబ్రా రాష్ట్ర గవర్నర్ చార్లెస్ సోలెడో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వరద బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పడవ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితుల కుటుంబాలకు చార్లెస్ సోలెడో తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద ఉద్ధృతి ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ స్కూల్లో ఫీజు ఏడాదికి రూ. 1.23 కోట్లు.. ఒక్కో విద్యార్థికి నలుగురు టీచర్లు..
ఇదీ చదవండి: 66 మంది పసిపిల్లలను బలితీసుకున్న ఈ 4 రకాల టానిక్‌లు!