చెవిలోకి చిన్న చీమ దూరితేనే ఏదో జరిగిపోయినట్లుగా గాబరా పడతాం. లోనికి నీళ్లు పోసి.. తల అటు ఇటు తిప్పి ఎలాగోలా బయటకి వచ్చేలా ప్రయత్నిస్తాం. అలాంటిది.. ఓ వ్యక్తి చెవిలో ఏకంగా మాంసాన్ని తినే పురుగులు పుట్టపెట్టేశాయి. చెవిలో కొంతభాగాన్ని తినేసాయి కూడాను. అయితే అతనికి మాత్రం తన చెవిలో ఇంత భయంకరమైన పురుగులు ఉన్నాయన్నా విషయం తెలియదు. చెవిలో దురద అనిపించి.. పరీక్షిస్తే రక్తస్రావం అవుతున్నట్లుగా గమనించాడు. వెంటనే డాక్టర్ల వద్దకు పరుగెత్తాడు. అతని చెవి భాగాన్ని పరీక్ష చేసిన వైద్యులు.. స్కానింగ్ తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 64 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి చెవిలో దురద, రక్తస్రావం అవుతుందన్న కారణంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. అతనిని పరిక్షించిన వైద్యులు.. స్కానింగ్ రిఫర్ చేశారు. ఆ రిపోర్ట్ లో అతని చెవిలో మాంసాన్ని తినెయ్యగల మగ్గోట్ పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. అప్పటికే అవి అతని చెవిలో కొంత భాగాన్ని తినేసి రంధ్రం చేసినట్లు గుర్తించారు. అనంతరం చెవిని నీటితో శుభ్రంగా కడిగి.. చెవిలో ఉన్న లార్వా దశ పురుగులను బయటకు తీసారు. ఈ తతంగాన్నంతా చిత్రీకరించారు.
ఆ పరుగుల కదలికలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువుగా కుళ్ళిన కళేభరాలపై కనిపిస్తుంటాయి. అందుకే.. గాయాలైనప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా జాగ్రత్తపడాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. ఇవి క్రమక్రమంగా మొత్తం భాగాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడేస్తాయి. ఏదేమైనా.. శరీరంలో ఒక భాగాన్ని ఇంతటి భయంకరమైన పురుగులు తింటున్నా.. సదరు వ్యక్తిలో చలనం లేదంటే ఎంత సైలెంట్ గా పనికానిస్తున్నాయన్నది ఆలోచించాల్సిందే.