ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వేల ఆవులు రైతు కళ్ళ ముందు కాలి బూడిదైపోయాయి. ఒక ఆవుకి దెబ్బ తగిలితేనే విలవిలలాడే పరిస్థితి. చనిపోతే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది 18 వేల ఆవులు కళ్ళ ముందే బూడిదైపోయాయి.
ఆవును భారతీయులే కాదు విదేశాల్లో కూడా దైవంగా భావిస్తారు. ఆవును వధించే వ్యాపారం కంటే ఆవు పాల వ్యాపారంతో ఎక్కువ లాభాలు తీసుకురావచ్చునని చెప్పి డెయిరీ ఫార్మ్ లను విలువలతో నడిపేవారు ఎంతో మంది ఉన్నారు. డెయిరీ ఫార్మ్ లో ఉండే వారు ఆవుల పట్ల చాలా ప్రేమగా, సున్నితంగా ఉంటారు. ఎన్నో ఏళ్లుగా వాటితో బంధాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో బంధువుల్లా వాటిని చూసుకుంటారు. ఇల్లు, ఆవులు తప్ప వేరే లోకం ఉండదు. ఒక ఆవుకి చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతారు. అలాంటిది కళ్ల ముందే 18 వేల ఆవులు కాలిబూడిదైపోతుంటే వాటి యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
డెయిరీ ఫార్మ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూగజీవాలను మృత్యువు కబళించింది. డెయిరీ ఫార్మ్ లో పేలుడు కారణంగా 18 వేల ఆవులు మృత్యువాత పడ్డాయి. ఇన్ని వేల ఆవులు చనిపోవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లో ఉన్న డెయిరీ ఫార్మ్ లో చోటు చేసుకుంది ఈ సంఘటన. టెక్సాస్ లోని డిమ్మిట్ లో ఉన్న సౌత్ ఫోర్క్ డైరీ ఫార్మ్ లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 18 వేల ఆవులు చిక్కుకుని మరణించాయి. మంటలు చెలరేగిన గంటల్లోనే దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో డైరీ ఫార్మ్ సిబ్బందికి గాయాలు అయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భారీ పేలుడు కారణంగా డెయిరీ ఫార్మ్ లో ఉన్న 90 శాతం ఆవులు చనిపోయాయి. చనిపోయిన వాటిలో హోల్స్టెయిన్, జెర్సీ జాతికి చెందిన ఆవులే ఉన్నాయి.
అయితే యూఎస్ లో రోజూ వధించే ఆవుల సంఖ్యతో పోలిస్తే.. ఈ పేలుడులో మరణించిన ఆవుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువ అని చెబుతున్నారు. పాలు సేకరించే ఫ్లోర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆవు పేద తొలగించే యంత్రం ఓవర్ హీట్ అవ్వడం వల్లే ఈ పేలుడు సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. పేడ నుంచి వెలువడే మీథేన్ గ్యాస్ వల్ల పేలుడు స్థాయి మరింత ఎక్కువైందని భావిస్తున్నారు. ఐతే ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇన్ని వేల ఆవులు కళ్ల ముందే కాలి బూడిదైపోవడం పట్ల రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. అందరిలా ఆవులను చంపకుండా వాటి పాలతో నీతిగా వ్యాపారం చేస్తున్న రైతు కళ్ళలో నీళ్ళే మిగిలాయి చివరికి.