ఏదైనా విషయం పట్ల స్పందిస్తూ థమ్స్ అప్ ఎమోజీలను పంపిస్తున్నారా? అయితే ఇకపై చిక్కుల్లో పడే అవకాశం ఉంది. థమ్స్ అప్ ఎమోజీని అంగీకార సంతకంగా గుర్తిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించాడు. దీంతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ను ఉల్లంఘించినందుకు రైతుకు భారీ జరిమానా విధించారు.
నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ నూతన ఆవిష్కరణలతో పరుగులు పెడుతోంది. టెక్నాలజీ వృద్ధి చెందుతూ విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మానవుని జీవన విధానం మారిపోయింది. మనకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో మన కళ్ల ముందుండే వెసులుబాటు నేటి ఇంటర్నెట్ యుగంలోఅందుబాటులో ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ తో పాటు అనేక సోషల్ మీడియా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బాగా ప్రాచూర్యం పొందింది వాట్సాప్. దీని ద్వారా అవతలి వ్యక్తికి అవసరమైన సమాచారాన్ని అందించవచ్చు. అప్పుడప్పుడు మన ఫీలింగ్స్ ను షేర్ చేసుకునే సందర్భంలో పలు రకాల ఎమోజీలను వాడేస్తుంటాము. వాటిలో ప్రేమకు, ద్వేషానికి, అంగీకారానికి, కోపానికి, బ్లెస్సింగ్ కు సంబంధించిన పలు ఎమోజీలు ఉంటాయి. కాగా వాట్సాప్ లో అవునని తెలపడానికి థమ్స్ అప్ ఎమోజీని ఉపయోగిస్తుంటాము. కాదు అనే సందర్బంలో డౌన్ సింబల్ తో సూచిస్తుంటాము. కానీ ఈ థమ్స్ అప్ సింబల్ మన సంతకం కాబోతోంది. ఇది వింతగా అనిపించినా నిజంగానే ఓ దేశంలో చోటుచేసుకుంది. ఓ న్యాయమూర్తి ఎమోజీని సంతకంగా పరిగణిస్తూ ఓ రైతుకు జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కెనడాలో ఓ రైతుకు, కొనుగోలు దారుడి (కెంట్ మిక్కిల్ బరో) కి మధ్య అమ్మకం, కొనుగోలుకు సంబంధించి ఓ ఒప్పందం జరిగింది. రైతు(క్రిస్ అచ్టర్) తన దగ్గరున్న 86 టన్నుల ఫ్లాక్స్ ను $ 12.73(ఇండియన్ కరెన్సీలో 1050) ధరకు అమ్మేందుకు కొనుగోలుదారుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆసమయంలో కొనుగోలు దారుడు ఒప్పందానికి సంబందించిన అగ్రిమెంట్ ను సందేశం రూపంలో రైతుకు పంపించాడు. దానికి రైతు అంగీకరిస్తున్నట్లు థమ్స్ అప్ సింబల్ ను పంపించాడు. ఆ తరువాత ఫ్లాక్స్ ధర పెరగడంతో ఆ ఒప్పందానికి కట్టుబడనని రైతు తెగేసి చెప్పాడు. గతంలో చేసుకున్న ధరకు అమ్మనని తెలిపాడు. ఇక కొనుగోలుదారుడు చేసేదేమి లేక కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కెనడా న్యాయమూర్తి థమ్స్ అప్ ఎమోజీని అంగీకార సంతకంగా గుర్తిస్తూ తీర్పు చెప్పాడు. ఒప్పందం ఉల్లంఘించిన రైతుకు భారీగా జరిమానా విధించారు. $61.442( ఇండియన్ కరెన్సీలో 50 లక్షలు) చెల్లించాలని రైతును న్యాయమూర్తి ఆదేశించాడు. న్యాయస్థానాలు ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఉండాలని, తీర్పులు కూడా దానికి తగ్గట్లే ఉండాలని వెల్లడించారు. ఈ ఘటనతో ఇకపై థమ్స్ అప్ ఎమోజీలు పంపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని పంపాల్సి ఉంటుందని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.