తండ్రి బాటలోనే నడవాలని ఏ కొడుకైనా అనుకుంటాడు. వేలు పట్టి నడిపించిన తండ్రి మంచోడైతే, సక్రమ మార్గంలో నడిచేవాడైతే, పిల్లలు కూడా అదే తోవలో వెళ్తారు. ఒకవేళ తండ్రి చెడ్డోడై, పిల్లల్ని కూడా అదే మార్గంలో నడిపిస్తే.. వాళ్లు సమాజానికి హాని కలిగించే వారుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మెక్సికోలోని ఓ డ్రగ్ మాఫియా డాన్ గురించి తెలిస్తే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. మెక్సికోలో పేరుమోసిన డ్రగ్ మాఫియా సూత్రధారి ఎల్ చాపో. అతడు అగ్రరాజ్యం అమెరికాకు వేలాది టన్నుల డ్రగ్స్ ను సరఫరా చేసి కోట్లకు పడగలెత్తాడు .
కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలను యూఎస్‌కు తరలించి చాపో కోట్లను వెనకేసుకున్నాడు. 2009 ప్రపంచ కుబేరుల జాబితాలో 701వ స్థానంలో నిలిచాడంటేనే.. డ్రగ్స్ సరఫరాతో అతడు ఎంతలా కూడబెట్టుకున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల పాటు డ్రగ్స్ బిజినెస్ చేసిన చాపో.. తిరుగులేని మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఎట్టకేలకు అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి మెక్సికోలోని ఓ జైలులో బంధించారు. కానీ 2015లో అక్కడి సొరంగం నుంచి చాపో తప్పించుకున్నాడు. అనంతరం మెక్సికన్ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి 2017లో అమెరికాకు అప్పగించారు. డ్రగ్స్ సరఫరాతోపాటు మనీలాండరింగ్ తదితర కేసుల కింద అమెరికా 2019లో చాపోకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అప్పటి నుంచి అతడు జైలులోనే ఉన్నాడు.
చాపో అరెస్టయినా ఆగని డ్రగ్స్ దందా
చాపోకు గుజ్మన్ లోపెజ్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. తండ్రి జైలుకు వెళ్లినప్పటి నుంచి డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యాన్ని గుజ్మనే నడుపుతున్నాడు. ఈ క్రమంలో ముఠా బాధ్యతలు తీసుకున్న గుజ్మన్.. తండ్రిని మించిన తనయుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాడు. తన ముఠా సభ్యులతో డ్రగ్స్ సరఫరాతోపాటు రౌడీయిజం, హత్యలూ చేయించేవాడు. ‘ది మౌస్’ అనే పేరుతో పిలవబడే గుజ్మన్‌ను పట్టుకునేందుకు మెక్సికన్ పోలీసులు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే చివరకు భారీ మిలటరీ ఆపరేషన్ చేపట్టి అతడ్ని అరెస్ట్ చేశారు.
గుజ్మన్ ఎదుగుదలకు అదే కారణం
పోలీసులు తమ ముఠా నాయకుడ్ని అరెస్టు చేశారన్న విషయం తెలియగానే గుజ్మన్ లోపెజ్ అనుచరులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించి విధ్వంసానికి పాల్పడ్డారు. డజన్ల కొద్దీ వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆగకుండా ఏకంగా ఎయిర్ పోర్టు మీద ఎటాక్ చేశారు. పటిష్ఠ భద్రత ఉండే విమానాశ్రమయం పైనే దాడులకు దిగారంటే వారి సామర్థ్యం, స్థానికంగా వారికి ఉన్న పట్టు ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఇకపోతే, గుజ్మన్ లోపెజ్‌కు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన సొమ్మును తాను మాత్రమే అనుభవించకుండా.. అక్కడి ప్రజలకు గుజ్మన్ పంచిపెడుతుండేవాడు. తన ముఠాలోకి యువకులను ఆకర్షించేందుకు వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తుండేవాడు. అందుకే వారంతా అతడికి నమ్మిన బంటులా పని చేసేవారు. ఆ నమ్మకమే గుజ్మన్‌ను బలమైన డ్రగ్ మాఫియా డాన్‌గా, ప్రభుత్వాన్నే శాసించే శక్తిగా ఎదిగేలా చేసిందని చెబుతుంటారు. మరి, గుజ్మన్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.